జెనీలియా అభిమానులకు షాకింగ్ న్యూస్
ముంబై : చిలిపి పనులు చేసే అమ్మాయిగా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ జెనీలియా. ఆమె తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఢీ, రెడీ తదితర చిత్రాలు మంచి విజయం సాధించాయి. తాజాగా జెనీలియా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ అందుతోంది.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌తో పెళ్లి తర్వాత ఒక్క ప్రాజెక్టుకు కూడా సైన్ చేయని జెనీలియా...ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవుతోంది. ఇదే విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ....'నేను నా కెరీర్‌ని చాలా యంగ్ ఏజ్ లో మొదలు పెట్టాను. దాదాపు 10 ఏళ్ల పాటు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేసాను. దాదాపు 5 సిని పరిశ్రమల్లో భాగమయ్యాను. పెళ్లి తర్వాత పూర్తిగా విరామం అవసరం అని భావిస్తున్నాను' అని ఆమె వ్యాఖ్యానించారు.
జెనీలియా చివరి సారిగా తెలుగులో దగ్గుబాటి రాణా సరసన 'నా ఇష్టం' చిత్రంలో నటించింది. ఆమె ప్రస్తుతం గతంలోనే కమిటైన రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే అవి విడుదల కానున్నాయి. ఈ చిత్రాల తర్వాత ఆమె ఇక పూర్తిగా వెండి తెరకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యలను బట్టి స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications












