'గబ్బర్‌సింగ్' తో ఆ విషయం అర్దమైంది
హైదరాబాద్ : చేతిలో ఒక్క హిట్టూ లేకుండా వరస ఫెయిల్యూర్స్ తో దూసుకుపోతున్న సమయంలో శృతిహాసన్ కి హిట్టు ఇచ్చి ఆదుకున్న సినిమా 'గబ్బర్‌సింగ్' . పవన్ కెరీర్ లో ఘన విజయం సాధించిన చిత్రంగా నమోదు అయిన ఈ చిత్రం శృతి కెరీర్ కు సైతం ఉపయోగపడింది. ఐరన్ లెగ్ అనే ముద్రతో ఆమెను దూరం పెట్టిన వారు సైతం ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారు. ఈ నేపద్యంలో ఆమె మీడియాతో మాట్లాడింది.
ఆమె మాటల్లోనే.... ''ప్రేక్షకుల్ని మెప్పించే పాత్రల్లో నటించినప్పుడే ఆనందం. 'గబ్బర్‌సింగ్' సినిమాతో ఆ విషయం నాకు అనుభవమైంది. ఈ యేడాది ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తాను. తొలినాళ్లలో తెరపై నేనెలా కనిపిస్తే బాగుంటుంది? అని ఆలోచించుకొనేదాన్ని. ఇప్పుడలా కాదు, నేనెలా కనిపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది? అని ఆరా తీస్తున్నా. నాలో వచ్చిన కీలకమైన మార్పు ఇదే. ప్రతి సినిమాతోనూ ఓ కొత్త పాఠాన్ని నేర్చుకొంటున్నా''ని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్.
అలాగే... ''సినిమా, సంగీతం... ఇవి నాకు రెండు కళ్లు. ప్రస్తుతానికి సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను. భవిష్యత్తులో సమయం దొరికితే తప్పకుండా సంగీతంపై దృష్టి పెడతాను'' అని చెప్పుకొచ్చింది. ఆమె సక్సెస్ వెనక సీక్రెట్ కష్టపడి పనిచేయటమేనని చెప్పింది.
ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తీరిక లేకుండా గడుపుతోంది. శృతి తెలుగులో రవితేజతో 'బలుపు', రామ్‌చరణ్‌తో 'ఎవడు'తో పాటు ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తోంది. హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయా'తో పాటు మరొక చిత్రంలో నటిస్తోంది. '
ఈ రోజు (సోమవారం) శ్రుతిహాసన్ జన్మదినం. ఆమెకు ధట్స్ తెలుగు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











