మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా శృతి హాసన్
హైదరాబాద్: మహిళ పట్ల చూపుతున్న వివక్ష, లైంగిక హింస, దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న కాంపెయిన్‌లో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాలు పంచుకోబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ ఫర్హాన్ అక్తర్, రణవీర్ సింగ్, యువరాజ్ సింగ్, అనుష్క శర్మ, సునిధి చౌహాన్, నేహా ధూపియా లాంటి వారు ఈ కాంపెయిన్‌లో భాగంగా కాగా తాజాగా శృతి హాసన్ కూడా చేరారు.
‘రీచ్ ఫర్ ది స్కై' పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి శృతి హాసన్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. దీనిపై శృతి హాసన్ మాట్లాడుతూ...‘మహిళల పట్ల చూపుతున్న వివక్ష, దాడులు, దారుణాలు, అత్యాచారాలకు అడ్డకట్ట వేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మహిళా శక్తి ఏమిటో నిరూపించాలి. అందుకు అందరం కలిసి కట్టుగా పని చేయాలి' అని శృతి హాసన్ అన్నారు.

దీంతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా శృతి హాసన్ తన మద్దతు ప్రకటిస్తూ కాంపెయిన్స్‌లో పాల్గొంటోంది. ఎయిడ్స్ వ్యాధిపై జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, చైల్డ్ ఎడ్యుకేషన్‌పై చైతన్యం లాంటి కార్యక్రమాలు చేపడుతోంది. కాశ్మీర్ వరద బాధితుల కోసం ముంబైలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో కూడా శృతి హాసన్ పాలు పంచుకుంది.
ప్రస్తుతం శృతి హాసన్ తమిళ చిత్రం పూజై షూటింగులో బిజీగా గడుపుతోంది. ఈచిత్రంలో ఆమె విశాల్ సరసన నటిస్తోంది. ఈచిత్రం తెలుగులో ‘పూజ' పేరుతో విడుదల కానుంది. దీంతో పాటు ‘వెల్ కం బ్యాక్' అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











