ఆ చిత్రంలో హీరోకాదు...హాస్యనటుడుగానే సిద్దార్ద
ముంబై: తాజాగా తెలుగులో రిలీజైన జబర్దస్త్ చిత్రం ఫెయిల్యూర్ కావటంతో ఇప్పుడు సిద్దార్ద దృష్టి మొత్తం బాలీవుడ్ చిత్రం చష్మే బుద్దూర్ పైనే ఉంది. ఆ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమాలో సిద్దార్ద హీరో కాదు..కేవలం కామెడీ పండించే హాస్యనటుడు తరహా పాత్ర అని తెలుస్తోంది. 'బాయ్స్' సినిమా పేరు వినిపించగానే గుర్తొచ్చేది సిద్దార్థ. ఈ చిత్రంతో దక్షిణాదిన అడుగుపెట్టి యువ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దార్థ ఇప్పుడు బాలీవుడ్‌లో హాస్యనటుడి అవతారం ఎత్తనున్నాడు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్న చష్మే బుద్దూర్ చిత్రంలో ఆలీ జఫర్‌తో పాటు మరో హీరోగా నటిస్తున్నాడు. ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగులో నటిగా అడుగు పెట్టిన తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్దార్థ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. చష్మి బద్దూర్ చిత్రం అలనాటి క్లాసిక్ రీమేక్ కావటంతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.
2006లో దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన 'రంగ్ దే బసంతి' చిత్రంలో బాలీవుడ్ తెరకు పరిచయం అయిన సిద్దార్థ ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో స్ట్రయికర్ అనే చిత్రంతో సొలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ సిద్దూ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్న సిద్దార్థ తెలుగులో మాత్రం ఒక్క చిత్రమూ చేతిలో లేదు.


Click it and Unblock the Notifications











