వెండితెరకే ఓ బ్రాండ్ అది బాలకృష్ణ రేంజ్..!
ఆయన కత్తులు, కటార్లు పట్టుకోక్కర్లేదు... గట్టిగ్గా కళ్లెర్రజేస్తేనే చాలు... ఎంతటివారైనా సరే మాడిమసైపోవాల్సిందే... ఆయన తుపాకులు, బాంబులు పేల్చక్కర్లేదు... గట్టిగా అరిస్తే చాలు... ఆ సౌండుకే గుండె ఆగి చచ్చిపోతారు. అందుకే, 'కత్తులతో కాదురా... కంటి చూపుతో చంపేస్తా' అన్నా, 'సౌండుకే చచ్చిపోతావ్' అన్నా ప్రేక్షకులు కరతాళ ద్వనులు చేశారు. కాసుల వర్షం కురిపించారు. అది యువరత్న బాలకృష్ణ రేంజ్! వెండితెరపై అది బాలకృష్ణ బ్రాండ్!
నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు అబిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ, 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి గారి దర్శకత్వంలో 1974 లో వచ్చిన 'తాతమ్మకల' చిత్రం ద్వారా సినీరంగప్రవేశం చేసారు. తరవాత పది సంవత్సరాల కాలంలో చాలావరుకు తన తండ్రిగారి దర్శకత్వం వహించిన 'అన్నదమ్ముల అనుభందం', 'దాన వీర సూర కర్ణ' వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు.
1984 లో 'మంగమ్మగారి మనవడు' సినిమా ఘనవిజయంతో సోలోహీరోగా స్థిరపడ్డారు. తరవాత కధానాయకుడు, ముద్దులమామయ్య, లారిడ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సూపర్ హిట్ లతో తెలుగు సినీపరిశ్రమ మూడో తరం టాప్ నలుగురు కధనాయకులలో ఒక్కరిగా ఉన్నారు. ఎన్టీఆర్ తరవాత పౌరాణిక, జానపద చిత్రాలలో ఆకట్టుకునేవిధంగా నటించగల సత్తా బాలయ్యకే ఉంది అని 'బైరవ ద్వీపం', 'శ్రీకృష్ణార్జున విజయం' వంటి చిత్రాలతో నిరూపించాడు. పవర్ ఫుల్ డైలాగులు చెప్పడంలోను, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలో బాలయ్యకు మించినవాళ్ళు ఈతరంలో లేరు అనటం లో అతిశయోక్తి లేదు. బాలయ్య కు ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని పరాజయాలు ఉన్నాయి. కానీ ప్రతి పరాజయాల పరంపరను ఓ బ్లాక్ బాస్టర్ హిట్ తో తుడిచేయటం బాలయ్య అలవాటు. ఆ కోవలోకే వస్తాయి ముద్దుల కృష్ణయ్య, లారి డ్రైవర్, సమరసింహా రెడ్డి, సింహ సినిమాలు.
ఎప్పటికైనా గోనగన్నారెడ్డి, చంగీజ్ ఖాన్ చిత్రాలు రుపొందించాలన్నది బాలయ్యకల. సినిమాలు కాకుండా 2009 శాసనసభ ఎన్నికల కోసం తెలుగు దేశం పార్టీలో చేరి ప్రచారం చేసారు. 2014 ఎన్నికల సమయానికి పార్టీలో కీలక బాద్యతలు చేపట్టే అవకాశం ఉంది. 'సింహ' ఘన విజయం ఇచ్చిన కొత్త ఉత్సాహంతో ప్రస్తుతం 'శ్రీ రామ రాజ్యం' చిత్రంతో పాటు కీర్తి కంబైన్స్ ఫై వస్తున్నా చిత్రంలో మూడు విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. అలాగే మంచు మనోజ్ సినిమాలో తోలి సారి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు బాలయ్య జన్మదినం సందర్బంగా 'హర హర మహాదేవ' ప్రారంభం కానుంది. ఇలా వరస సినిమాలతో దూసుకు పోతున్నబాలయ్య మరెన్నో విజయవంతమైన చిత్రాలు తెలుగు సినీపరిశ్రమకు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ దట్స్ తెలుగు తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.


Click it and Unblock the Notifications











