తమిళ 'గబ్బర్ సింగ్'ని వదులుతున్నారు
హైదరాబాద్: సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ దబాంగ్ చిత్రం తెలుగులోకి గబ్బర్ సింగ్ గా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దబాంగ్ తమిళ వెర్షన్ 'ఓస్తి'ని తెలుగులోకి డబ్ చేసి వదులుతున్నారు. తమిళ యంగ్ హీరో శింబు నటించిన 'ఓస్తి' చిత్రాన్ని ఫైవ్ కలర్స్ మీడియా సంస్థ అధినేత శ్రీనివాస్ దామెర 'పోలీస్ టైగర్' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ 'శింబు పేరు చెప్పగానే 'మన్మధ' చిత్రం గుర్తుకు వస్తుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడాయన. శింబు నటించిన 'ఓస్తి' చిత్రాన్ని తెలుగులో 'పోలీస్ టైగర్' పేరుతో అనువదిస్తున్నాం. ఇందులో శింబు పోలీస్ ఆఫీసర్‌గా ఓ పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. ఆయన పాల్గొన్న ఫైట్లు, డాన్సులు అందరినీ అలరిస్తాయి. ఈ నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ వస్తుంది. డిసెంబర్ ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తాం. ఇందులో శింబుతో కలిసి ఆడి పాడిన మల్లికాషెరావత్ నృత్యం మాస్‌ని బాగా అలరిస్తుంది' అన్నారు.
ఇప్పుడు ఈ చిత్రం గబ్బర్ సింగ్ చూసినవాళ్లకు ఆసక్తి రేపే అవకాసం ఉందని అంటున్నారు. ఈ సినిమాని,గబ్బర్ సింగ్ ని పోల్చి చూస్తారంటున్నారు. అయితే కేవలం శాటిలైట్ కోసం డబ్బింగ్ చేసారా లేక మార్కెట్లో ఆడుతుందని చేసారా అనేది అర్దం కావటం లేదంటున్నారు. ఇక ఇప్పటికే దబాంగ్ ని డైరక్ట్ గా మాటీవీ వారు డబ్ చేసి వాళ్ల ఛానెల్ లో కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు. ఇక దర్శకుడు ధరణి దర్శకత్వంలో గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా బంగారం చిత్రం వచ్చి ప్లాప్ అయ్యింది.
శింబు సరసన రిచా గంగోపాధ్యాయ నటించిన ఈ చిత్రంలో మరో జంటగా రమేశ్, శరణ్య నటించారు. సోనూ సూద్, నాజర్, నిళల్‌గళ్ రవి, సంతానం, విజయకుమార్, గణేశ్, రేవతి ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి మాటలు: మల్లూరి వెంకట్, పాటలు: భాగ్యశ్రీ, రాఖీ, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: గోపీనాథ్, నిర్మాత: శ్రీనివాస్ దామెర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధరణి.


Click it and Unblock the Notifications











