వేలానికి బాలయ్య సింహా కత్తులు, గండ్రగొడ్డలి
హీరో బాలకృష్ణ సింహా సినిమాలో వాడిన కత్తులను, గండ్రగొడ్డలిని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) వేలం పాటలో విక్రయించడానికి పూనుకుంది. ఈ మేరకు మా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేలం పాట సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఐదు లక్షల రూపాయలతో కత్తుల వేలం పాట ప్రారంభమైంది. వాటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బును పేద కళాకారులకు ఇవ్వనున్నట్లు మా అధ్యక్షుడు మురళీ మోహన్ చెప్పారు. గండ్రగొడ్డలి కొనుగోలుకు న్యూజెర్సీకి చెందిన వెంకట్ గరికపాటి ఐదు లక్షల రూపాయలకు కొనడానికి బిడ్ వేశాడు. ఇది తొలి బిడ్డింగ్.
సింహా చిత్రంలో వాడిన కత్తులు, గండ్రగొడ్డలి నిరుపయోగం కాకుండా పరోక్షంగా ఉపయోగపడేలా మా కార్యక్రమం తీసుకుని వాటి వేలానికి పూనుకోవడం ఆనందంగా ఉందని బాలకృష్ణ అన్నారు. వేలం పాట ప్రారంభాన్ని ప్రకటించక ముందే వాటిని కొనడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. గండ్రగొడ్డలికి గరికపాటి వెంకట్ బిడ్ వేసిన విషయాన్ని ఆయన ప్రకటించారు. హాలీవుడ్ నటీనటులు వాడిన వస్తువులను, ఇతరాలను వేలం వేసే పద్ధతి ఉందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











