Bappi Lahiri: సినీ ఇండస్ట్రీలో పెను విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటికే చాలా మంది గొప్ప గొప్ప ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు మరణించారు. అలాగే, చాలా మంది పెద్ద పెద్ద నటులతో పాటు చిన్న ఆర్టిస్టులు కూడా చనిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ చలన చిత్ర రంగంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. తాజాగా లెజెండరీ మ్యూజిక్ కంపోజర్, సింగర్ బప్పీలహరి కన్నుమూశారు.

ఐదు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో
ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా ఎనలేని సేవలు అందించిన బప్పీలహరి (69) బుధవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న ఆయన.. మంచానికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బప్పీలహరిని ముంబై నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడి వైద్యులు ఈ లెజెండరీ కంపోజర్‌కు చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆ ఆస్పత్రిలోనే బప్పీలహరి తుదిశ్వాసను విడిచినట్లు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి వర్గాల నుంచి ప్రకటన కూడా వెలువడింది.

కరోనావైరస్ బారిన పడి
వయసు మీద పడినా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ కనిపించిన దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహరి గత ఏడాది ఏప్రిల్‌లో కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పడు చాలా రోజుల పాటు ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సను తీసుకుని కోలుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత చికిత్సను తీసుకుని తేరుకున్నారు. ఈ కారణంగానే బప్పీలహరి కొంత కాలంగా బయట పెద్దగా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించడంతో పాటు అవయవాల పనితీరు సంక్లిష్టంగా మారిందని తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 16వ తేదీన ఆయన తుది శ్వాసను విడిచారని సమాచారం.

తెలుగు సినిమా పరిశ్రమతో అనుబంధం
దేశంలోని చాలా భాషల్లో సంగీతం అందించడంతో పాటు గాయకుడిగానూ బప్పీలహరి పని చేశారు. మరీ ముఖ్యంగా తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. 'సింహాసనం' నుంచి మొదలుకొని.. స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీగారిపెళ్లాం, దొంగ పోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్‌బాస్, ఖైదీ ఇన్‌స్పెక్టర్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందిచారు. తెలుగులో ఇటీవల రవితేజ నటించిన 'డిస్కో రాజా' చిత్రంలో కూడా పాట పడారు. కాగా, హిందీలో 2020లో విడుదలైన 'బాఘీ' 3 సినిమాలో తన చివరి పాట పాడారు.

ప్రముఖుల సంతాపం
బప్పీలహరి మరణంతో సినీ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంపై అభిమానులు, సెలెబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చాలా మంది పోస్టులు చేస్తున్నారు. దీంతో బప్పీలహరి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











