ఆ విషయం తెలిసి షాకయ్యాను..: సింగర్ నిరంజనా ఇంట్రెస్టింగ్..
Recommended Video

సినిమా పాటల విషయంలో దర్శకుల అభిరుచి మారుతోంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారో.. ఇటీవలి కాలంలో సాంప్రదాయ బాణీలకు అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్తారింటికి దారేదిలో 'దేవం భజే..', అర్జున్ రెడ్డిలో 'సుమనస వందిత', తాజాగా అజ్ఞాతవాసిలో 'మధురాపురి సదనా' వంటి సాంప్రదాయ గీతాలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.
అజ్ఞాతవాసిలో 'మధురాపురి సదనా' పాట ఇప్పుడు చాలామంది రింగ్ టోన్ గానూ మారిపోయింది. ఈ పాటతో సింగర్ నిరంజనా రమణన్‌కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే తనతో ఈ పాట పాడించినప్పుడు.. ఇది అజ్ఞాతవాసి సినిమాలో పెట్టబోతున్నారన్న విషయం అసలు ఆమెకు తెలియదట. తెలుగులో పాట పాడే అవకాశం గురించి నిరంజనా చెప్పిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే...

అనిరుధ్ ఫోన్ కాల్..:
ఓరోజు అనిరుధ్ రవిచంద్రన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆఫీసుకు రమ్మంటే వెళ్లాను. అక్కడే 'స్వాగతం కృష్ణా..' లిరిక్స్ ఇచ్చి పాడించారు. అయితే అది సినిమా కోసం చేస్తున్న రికార్డింగ్ అని నాకప్పటికీ తెలియదు. కర్ణాటక సంగీతంతో కూడిన సాంగ్స్ ఈరోజుల్లో సినిమాల్లో ఎవరు పెట్టట్లేదు కదా!.. అందుకే ఆ ఛాన్స్ లేదనుకున్నాను.

షాకయ్యాను..:
సాంగ్ రికార్డ్ చేసిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పాట పవన్‌కల్యాణ్ సినిమాలో పెట్టబోతున్నారని. ఆ తర్వాత అదే పాట 'అజ్ఞాతవాసి' టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వినిపించడంతో షాకయ్యాను. కానీ నా జీవితంలో చాలా సంతోషాన్నిచ్చిన పాట ఇది. కేవలం 90నిమిషాల్లోనే రికార్డింగ్ పూర్తి చేశాం.

ఇదో మధురానుభూతి..:
తమిళ అమ్మాయినే అయినా.. తెలుగుపై నాకు ఆసక్తి, అభిమానం ఉన్నాయి. చెన్నైలో జరిగే పార్టీలు, డీజేల్లో కనీసం ఒక్క తెలుగు పాటైనా వినిపిస్తుంటుంది. తెలుగులో పాడటం ఇదే తొలిసారి కావడం.. ఆడియో వేడుక సందర్భంగా అంతమంది ముందు నేను పాడటం నా జీవితంలో ఒక మధురమైన అనుభూతి.

'అర్జున్‌రెడ్డి' పాట కూడా ఇష్టమే:
'అర్జున్‌రెడ్డి'లో 'సుమనస వందిత' పాట కూడా నాకు ఇష్టమే. ఇక 'స్వాగతం కృష్ణా' కృతిని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సరికొత్త బాణీతో వినిపించారు. మూలం చెడిపోకుండా జాగ్రత్తపడుతూనే గిటార్‌తో అద్భుతమైన బాణీని కంపోజ్ చేశారు. ఈ పాటకు నేను కె.జె.ఏసుదాసు సార్‌ని అనుసరిస్తూ వెళ్లాను.

కెరీర్ గురించి..:
నువ్వున్న వృత్తిలో నీకేం కావాలో ముందు నీకు క్లారిటీ ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సింగర్ 500పాటలు పాడటం నిజంగా మనం ఊహించుకోలేం. కానీ దానికి అతీతంగా ముందుకు సాగాలంటే సంగీత మూలాలను ఆకలింపు చేసుకుంటూ సాగిపోవడమే.

అసలు మూలం అది..
'అజ్ఞాతవాసి'లో 'స్వాగతం కృష్ణా' పాటకు అసలు మూలం ప్రముఖ సంగీత విద్వాంసుడు ఊతుక్కాడు వెంకట సుబ్బయ్యార్ రచించి, స్వరపరిచిన గీతం. ఆ పాటనే అనిరుధ్ పవన్ సినిమాలో వాడుకున్నారు. దాదాపు పదేళ్లుగా కర్ణాటక సంగీతంతో అనుబంధం ఉన్న నిరంజనా ఈ పాటను అద్భుతంగా పాడారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











