ఆరు పెద్ద సినిమాలు తాత్కాలికంగా నిలిపివేత
నిర్మాతల మండలి నిర్ణయం మేరకు మే నెలలో మొదలు కావాల్సిన ఆరు భారీ బడ్జెట్ సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది. ఆ ఆగే చిత్రాల్లో వెంకటేష్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మించే 'ఆప్తరక్షక', రామ్ చరణ్ తేజ్ తో ధరణి దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ నిర్మించనున్న చిత్రం, అల్లు అర్జున్ తో వినాయక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించే 'బద్రినాథ్', రామ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'స్రవంతి' రవికిషోర్ నిర్మించే చిత్రం, ప్రభాస్, దశరథ్ కాంబినేషన్ లో 'దిల్'రాజు నిర్మించనున్న చిత్రం, తేజ ఓ స్టార్ హీరోతో చేయబోయే చిత్రం..ఈ జాబితాలో ఉంది. నిర్మాణ వ్యయం అదుపు విషయంలో సరైన మార్గాలను అన్వేషించి, పక్కాగా నిర్ణయాలు తీసుకున్నాకనే ఈ చిత్ర నిర్మాణాలను మొదలుపెట్టాలనే యోచనలో ఆయా నిర్మాతలు ఉన్నట్టుగా తెలిసింది.
గురువారం నిర్మాతల మండలి కార్యాలయంలో చాలామంది నిర్మాతలు సమావేశమై పొదుపు చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. త్వరలో షూటింగ్ మొదలు పెట్టాల్సిన భారీ బడ్జెట్ సినిమాలను ప్రారంభించకుండా కొన్నాళ్లు వేచి చూసే ధోరణి కనబరచాలని కొందరు నిర్మాతలు నిర్ణయించారు. స్టార్స్, సాంకేతిక నిపుణుల పారితోషికాలు రోజు రోజుకీ పెరిగిపోవడంతోపాటు, అత్యధిక పనిదినాలు, అనవసర ఖర్చుల కారణంగా నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన నిర్మాతల మండలి ఎట్టకేలకు ఈ విషయంపై దృష్టి సారించింది. నిర్మాణ వ్యయాన్ని అదుపు చేసే అంశాలపై అధ్యయనానికి 'దిల్'రాజు అధ్యక్షతన కమిటీని నియమించింది. అల్లు అరవింద్, డాక్టర్ కె.ఎల్.నారాయణ, సి.కళ్యాణ్, 'స్రవంతి' రవికిషోర్, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ణ, ప్రసన్న కుమార్ తదితరులు ఈ కమిటీలో సభ్యులు.


Click it and Unblock the Notifications











