పవన్ కల్యాణ్ హీరోగా 'పులి'ని రూపొందించనున్న దర్శకుడు యస్‌జె సూర్య బలమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను తమిళంలో హీరోగానూ నటిస్తున్న సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం అతను తైముత్తు సెల్వన్ దర్శకత్వంలో 'న్యూటనిన్ మూండ్రమ్ వీధి' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఛేజింగ్ సీన్ తీస్తున్నప్పుడు సూర్య గాయల పాలయ్యాడు. చెన్నై సమీపంలోని వేలాచెరిలో ఈ సన్నివేశం తీస్తున్నారు. ఆ సన్నివేశం ప్రకారం బైక్ మీద వెళ్తున్న సూర్యను విలన్ రాజీవ్‌కృష్ణ కారులో వెంటాడుతున్నాడు. అనుకోకుండా బైక్ వేగం నెమ్మదించింది. దాంతో వెనుకనుంచి వస్తున్న రాజీవ్‌కృష్ణ కారు అతని బైకుని గట్టిగా ఢీకొంది. బాలెన్స్ తప్పిన సూర్య బైకుతో పాటు కింద పడిపోయాడు. అతని నుదిటికీ, చేతికీ బలమైన గాయాలు తగిలాయి. రక్తమోడుతున్న అతణ్ణి వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కనీసం 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూర్యకు డాక్టర్లు సూచించారు. దాంతో 'న్యూటనిన్ మూండ్రమ్ వీధి' షూటింగుకు అంతరాయం కలిగింది. అంతేకాదు. జూన్ 23 నుంచి ప్రారంభం కావాల్సిన 'పులి' రెగ్యులర్ షూటింగ్ సైతం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 'పులి' జూలై తొలివారంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.