»   » అమీర్ ఖాన్ కు మరోషాక్....

అమీర్ ఖాన్ కు మరోషాక్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అసహనం అంశంపై దేశ ప్రతిష్ట దెబ్బతినే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీర్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థ స్నాప్‌డీల్‌ అమీర్ ఖాన్ తమ సంస్థ ప్రచార కర్తగా కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు. గత కొంత కాలంగా స్నాప్‌డీల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న ఈ నెలాఖరుతో ముగియనుంది.

అమీర్‌ను మరో ఏడాది బ్రాండ్ అంబాసిడర్‌గా పొడిగించుకునే అవకాశం ఉన్నప్పటికీ అమీర్ అసహనం వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఆయన్ను ఇక తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించడం లేదని స్నాప్‌డీల్ ప్రకటించింది. అప్పట్లో అమీర్ ఖాన్ వ్యాఖ్యల అనంతరం నెటిజన్లు ఆయన ప్రచారం చేస్తున్న స్నాప్ డీల్ బహిష్కరించాలనే ప్రచారం లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో స్నాప్ డీల్ సంస్థ బెంబేలెత్తిపోయింది. ఆయన కొనసాగితే నష్టం తప్పదనే భావనకు వచ్చిన సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

మరో వైపు...అమీర్ ఖాన్ వ్యాఖ్యల వల్ల ఏర్పడిన వివాదం ఎఫెక్టుతో ఆయన్ను ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించిన సంగతి తెలిసిందే. 'ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' బ్రాండ్‌ అంబాసిడర్‌గా సుమారు పదేళ్ళపాటు అమీర్‌ఖాన్‌ పనిచేశాడు.

 Snapdeal not to renew Aamir Khan's contract

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ భారత్ బ్రాండ్‌కు నష్టం కలిగించారని, అందు వల్లే ఆయన్ను ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగటించినట్లు ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ కార్యదర్శి అమితాబ్ కాంత్ అన్నారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆయన ఆ బ్రాండ్‌ను పెంచేలా కృషి చేయాలి తప్ప నష్టం కలిగించరాదు, ఆయన్ను తొలగించడం సరైన చర్యే అన్నారు.

మొదట ఆయన తొలగింపుకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' అనే అంశానికి సంబంధించి ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించామనీ, ఆ ఏజెన్సీ అమీర్‌తో కాంట్రాక్ట్‌ విషయమై నిర్ణయం తీసుకుని వుండొచ్చని వాదించారు. ఇప్పుడు అధికారికంగా అమీర్‌ఖాన్‌ తొలగింపుపై ఓ అధికారి స్పష్టతనివ్వడం గమనార్హం.

అమీర్ ఖాన్....అసహనం వివాదంపై ఇటీవల మరోసారి స్పందిస్తూ...భారత్‌లో తీవ్ర అసహన పరిస్థితులు నెలకొన్నాయనో.. లేదంటే దేశం విడిచి వెళ్తాననో తాను ఎప్పుడూ చెప్పలేదని బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ అన్నారు. తాను భారతలోనే పుట్టానని, భారతలోనే చస్తానని అన్నారు. మీడియాలోని ఒక వర్గం కారణంగా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. మనదేశం మాదిరి విభిన్న భాషలు, సంస్కృతులు, నాగరికతలు ఉన్న దేశం మరొకటి లేదన్నారు. నాకు గానీ.. నా భార్యకు గానీ దేశం విడిచి వెళ్లాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. భారతీయుడనైనందుకు గర్విస్తున్నాను.

English summary
Snapdeal has decided not to renew Bollywood star Aamir Khan's contract as brand ambassador of the ecommerce company, two persons with knowledge of the development said. The one-year endorsement deal ends later this month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu