సుమంత్‌కి స్నేహ హస్తం
శ్రీరామదాసు చిత్రం తరువాత తెలుగులో అగ్ర హీరోయిన్‌గా పేరు సంపాదించిన స్నేహ సుమంత్‌తో కలిసి నటించబోతోంది. నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు ప్రతిష్టాత్మకమైన సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సుమంత్, స్నేహ జంటగా ఒక చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ నలుగురు చిత్రం ద్వారా మంచి దర్శకుడిగా గుర్తింపు పొందిన చంద్రసిద్ధార్థ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సుమంత్ హీరో అయి ఐదారేళ్లయినా తాతగారైన రామానాయుడికి మాత్రం ఇంతవరకూ కాల్ షీట్స్ ఇవ్వలేదు. సుమంత్ ఒక పట్టాన కథలు ఒప్పుకోడని తెలిసి కథ నచ్చితే ఎప్పుడైనా సినిమా చేద్దామని నాయుడుగారు ఆఫర్ ఇచ్చి కూడా చాలాకాలమైంది. చివరికి గోదావరి చిత్రం ద్వారా తన కెరీర్ ఒక గట్టుకు చేరడంతో ధైర్యంగా తాతగారి సినిమా చేయడానికి సుమంత్ అంగీకరించారని సినీవర్గాల అభిప్రాయం.
ప్రముఖ నవలా రచయిత్రి బలభద్రపాత్రుని రమణి అందించిన కథతో రూపొందే ఈ చిత్రంలో మరొక మంచి పాత్ర లభించడంతో నవ్వుల స్నేహ మొహం మరింత వెలిగిపోతోంది. ప్రస్తుతం స్నేహ - చంద్రముఖి ఫేమ్ పి. వాసు దర్శకత్వంలో నిర్మితమయ్యే చిత్రంలో బాలకృష్ణ సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications