సిద్ధార్థ్ 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : సిద్దార్థ్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మానందం ఈ చిత్రంలో లవ్ గురు గా హైలెట్ కానున్నారు.
అనువాదచిత్రాల నిర్మాతగా పేరు గాంచిన శ్రీలక్ష్మీగణపతి పిక్చర్స్ సంస్థ అధినేత బి.సుబ్రహ్మణ్యం తొలి ప్రయత్నంగా ఎన్.సురేష్‌తో కలిసి నిర్మిస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లోఈ చిత్రం తెరకెక్కుతోంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. సమ్‌థింగ్... అంటూ ఓ పాట పాడుకొన్నాడు సిద్ధార్థ్. ఇప్పుడు ఆ పాటనే తన సినిమాకి పేరుగా మార్చుకొన్నాడు.
సిద్ధార్థ్ మాట్లాడుతూ ''నేను నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో సమ్‌థింగ్ సమ్‌థింగ్... పాటంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటనే నా సినిమాకి పేరుగా నిర్ణయించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ప్రేమకథ ఇది. రజనీకాంత్, కమల్‌హాసన్‌లాంటి కథానాయకులతో సినిమాలు తీసిన దర్శకుడు సుందర్.సి. ఆయన తెలుగులో తొలి సినిమా చేస్తుండడం, అందులో నేను నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో నాతో పాటు బ్రహ్మానందం కూడా ఓ హీరోనే. ఆయనతో నేను కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి''అన్నారు.
''దేనికైనా రెడీ' తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న నా చిత్రమిదే. 'ఓ మై ఫ్రెండ్' తర్వాత సిద్ధార్థ్‌తో కలిసి నటిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది''అన్నారు హన్సిక. దర్శకుడు మాట్లాడుతూ ''తెలుగులో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకొంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ప్రేమ, వినోదం, కుటుంబ అనుబంధాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బ్రహ్మానందం ప్రేమ్‌జీ అనే లవ్‌గురు పాత్రలో కనిపిస్తారు. ఆయన దగ్గర సిద్ధార్థ్ ప్రేమ పాఠాలు నేర్చుకొనే విధానం వినోదం పంచుతుంది''అన్నారు.
''ఈవీవీ సత్యనారాయణ తర్వాత నాకు నచ్చిన దర్శకుడు సుందర్.సి. ఆయనతో మేం సినిమా తీయడం ఎంతో ఆనందంగా ఉంది. త్వరలోనే జపాన్‌లో రెండు పాటల్ని తెరకెక్కిస్తాం. మేలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు నిర్మాత. బ్రహ్మానందం, గణేష్ వెంకట్రామన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య, ఛాయాగ్రహణం: గోపి అమర్‌నాథ్, కళ: గురురాజ్, రచన: వెలిగొండ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











