విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం.. శబరిమలైలో ఉషాపూజ.. తమిళనాట రజనీ ఫ్యాన్స్ పూజలు
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. అయితే ఎస్పీ బాలు కోలుకోవాలని ఆయన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా శబరిమల ఆలయంలో కూడా బాలు ఆరోగ్యం కుదుటపడాలని పురోహితులు పూజలు నిర్వహించడం గమనార్హం. తాజాగా హాస్పిటల్ వర్గాలు వెల్లడించిన ప్రకారం..

ఎంజిఎం తాజా బులెటిన్ విడుదల
ఎంజీఎం హాస్పిటల్ తాజా బులెటిన్ ప్రకారం.. ఎస్పీ బాలు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స జరుగుతున్నది. ఈఎంవో సపోర్ట్‌తో ఆయన ఐసీయూలో ఉన్నారు. ఆయనకు విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది అని పేర్కొన్నారు.

శ్వాస సంబంధిత సమస్యలతో
బాలుకు శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఛాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఆయన జ్వరంతో కూడా బాధపడుతున్నారు. ఇంకా ఆయనకు కరోనావైరస్ పాజిటివ్‌గానే ఉంది. ఆయన ఆరోగ్యాన్ని, చికిత్స విధానాన్ని అత్యంత నిపుణులైన వైద్యులు పర్యవేక్షిస్తున్నారు అని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి.

శబరి మలై ఆలయంలో పూజలు
ఇదిలా ఉండగా, ఎస్పీ బాలు ఆరోగ్యం మెరుగపడాలని పవిత్ర శబరిమల ఆయలంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. బాలుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని పురోహితులు, వేద బ్రహ్మణులు ఉషా పూజాను నిర్వహించారు. ఉషా పూజాతో ఆయన కోలుకొంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Recommended Video

రజనీ, కమల్, విజయ్ ఫ్యాన్స్ పూజలు
ఇక తమిళనాడులోని పలు పట్టణాల్లో ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి రజనీకాంత్, కమల్, విజయ్ అభిమానులు పూజలు నిర్వహించారు. తంజావూరు, మధురైన సాలెం, ఈరోడ్, కోయంబత్తూరుతోపాటు పలు పట్టణాల్లో భారీగా ప్రార్థనలు నిర్వహించి ఆయన కోలుకోవాలని భగవంతుడిని కోరుకొన్నారు.


Click it and Unblock the Notifications











