twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు హీరోలకు ఎస్పీబీ చురకలు

    By Staff
    |

    "తెలుగు సినిమా ఒక కళామతల్లి. సినిమాకు సంబంధించిన వివిధ విభాగాలలో పనిచేసే వారంతా ఆ తల్లి ముద్దుబిడ్డలే. అయితే ఈమధ్య పెద్ద హీరోల ప్రవర్తన చూస్తే ఆ విషయం విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలుగు హీరోల మధ్య అనవసరమైన గ్రూపిజాలు ఎందుకు ఏర్పడుతున్నాయో అర్థం కాదు. ఈ గ్రూపులు సాధించేది ఏమీ లేకపోయినా తెలుగు సినిమాని మాత్రం నాశనం చేస్తున్నాయి. సినిమాకే కాదు, ఏ వ్యాపారానికైనా ముఖ్యకర్త పెట్టుబడి పెట్టేవాడే. అలాంటి సినిమా నిర్మాత పరిస్థితి ఇప్పుడు చూస్తే జాలేస్తుంది. డబ్బు సంచి చేతిలో పట్టుకుని, పెద్ద హీరోలు కార్లు దిగుతుంటే డోరు దగ్గర వినయంగా నిలబడి, డోర్‌ తీసి తమ భక్తి చాటుకునే దీనావస్థలో ఉన్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. నిర్మాతకు ఈరోజు సినిమా పరిశ్రమలో దక్కుతున్న గౌరవం ఇది అని తలుచుకుంటునే జాలేస్తుంది. నిర్మాత తర్వాతే ఎవ్వరైనా అనే స్పృహ పోయిందిప్పుడు. సినిమా కేవలం హీరోల మాధ్యమమే కాదు. ఒక లైట్‌బాయ్‌ లేకపోయినా ఆ రోజు షూటింగ్‌ నడవదు. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంటుంది. కేవలం తమ వల్లనే సినిమాలు ఆడుతున్నాయి అని ఈ హీరోలు అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఈమధ్య వచ్చిన సినిమాల ఫలితాలు చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది కూడా.

    ఈరోజు తెలుగు సినిమా చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. కోట్లు గుమ్మరించినా సినిమా ఆడుతుందన్న గ్యారంటీ నిర్మాతలకు లేదు. అక్షరం ముక్క రాయలేని వారు సైతం రచయితలు అయిపోతున్నారు. ఉచ్ఛారణ లేనివాళ్లు నటులవుతున్నారు. భాష తెలియని వారు, పరభాషా నటీనటులు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించేస్తున్నారు. సరిగమలు రానివారు సంగీత దర్శకులైపోతున్నారు. శ్రుతి శుద్ధి లేనివారు గాయకులవుతున్నారు. ఇదేం పరిస్థితి అని అడిగేవారు లేరు. ఇలాంటి స్థితిలో మంచి సినిమాలు రావడం కరవవుతోంది. చిన్న సినిమాని బతకనివ్వడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే.. తెలుగు సినిమా పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయం అని దుయ్యబట్టారు సుప్రసిద్ధ గాయకులు, గానగంధర్వ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం.

    డబ్బింగ్‌ సినిమాల నిషేధంపై ఒక టీవీ ఛానెల్‌ బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయాలు అడిగినప్పుడు నిర్మొహమాటంగా ఆయన అభిప్రాయాలు వెల్లడించి హీరోల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఉద్ధాన పతనాలు ఎన్నో ఏళ్లుగా ప్రత్యక్షంగా చూస్తున్న గాయకుడు, నిర్మాత, నటుడు అయిన బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. తెలుగు సినిమాని ప్రేమించే వారంతా ఎస్పీబీ స్ఫూర్తిగా ఒకసారి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిందే.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X