నాగార్జున సహా అక్కినేని వారంతా అక్కడే.. నాగచైతన్యతో కలిసి సమంత స్పెషల్ ప్లాన్
Recommended Video
నేడు (గురువారం) టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. 1959 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు జన్మించిన ఆయన.. నేటితో 60 వ సంవత్సరం లోకి అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ పుట్టిన రోజున నాగార్జున, ఆయన కుటుంబమంతా ఎక్కడున్నారు? బుధవారం ఉదయమే నాగ్, అమల ఫ్లయిట్ ఎక్కినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

60వ సంవత్సరం.. నాగార్జునకు ఎంతో ప్రత్యేకం
నాగార్జున జీవితంలో ఇదో ప్రత్యేక రోజు. ఎందుకంటే 60 పుట్టిన రోజు కాబట్టి. సాధారణంగా దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు నిండినప్పుడు జరుపుకొను వేడుక లేదా ఉత్సవాలను షష్టిపూర్తి అని అంటారు. ఇదే వేడుకను నాగార్జున - అమల చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అది కూడా స్పెయిన్‌లో.

అమలతో కలిసి ఫ్లయిట్ ఎక్కిన నాగార్జున
ఈ 60వ పుట్టినరోజు వేడుకను నాగార్జున.. తన అభిమానుల మధ్య జరుపుకోవడంలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య స్పెయిన్‌లో జరుపుకుంటున్నారు. ఈ మేరకు తన సతీమణి అమలతో కలిసి బుధవారం ఉదయం నాగార్జున ఫ్లయిట్ ఎక్కేసి స్పెయిన్ వెళ్లారు.

స్పెషల్ ప్లాన్ చేసిన సమంత
ఇక ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంత ఇంకొంతమంది సన్నిహితులు కలిసి రెండు రోజుల ముందే స్పెయిన్ చేరుకున్నారు. స్పెయిన్‌లోని ఇబిజా కాల్మాలో నాగ్ బర్త్‌డే వేడుకలకు అన్నీ సిద్ధం చేశారు. ఈ మేరకు నాగ్.. బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేలా భర్త నాగచైతన్యతో కలిసి స్పెషల్ ప్లాన్ చేసిందట సమంత.

విలాసవంతమైన హోటల్‌లో
స్పెయిన్ లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో రెండు రోజుల పాటు నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించారట. ఈ వేడుకలకు కొందరు ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందిందని, కొందరు ప్రముఖులు ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నారని తెలుస్తోంది.

కుటుంబమంతా వారం రోజుల పాటు
ప్రస్తుతం నాగార్జున సహా అక్కినేని కుటుంబమంతా స్పెయిన్ లోనే ఉంది. సుమారు వారం రోజులపాటు నాగార్జున తన కుటుంబ సభ్యులతో స్పెయిన్‌లో ఎంజాయ్ చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్ 6న నాగార్జున దంపతులు ఇండియాకు తిరిగొస్తారని ఫిలిం నగర్ టాక్.


Click it and Unblock the Notifications











