నేను 'ఈగ' మొదలుపెట్టడానికి కారణం: రాజమౌళి
హైదరాబాద్: రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' విడుదలై మూడో వారంలో కూడా ఎక్కడా కలెక్షన్స్ విషయంలో డ్రాప్ కాకుండా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఆయన మాట్లాడుతూ..''నేను ఈగ సినిమాని మొదలుపెట్టడానికి కారణం కమల్ కణ్ణన్. ఈగతో సినిమా ఏంటి? అనేవాళ్లకి సమాధానం చెప్పేలా మనం చేద్దాం అని ఆయనిచ్చిన ధైర్యంతోనే ముందుకు వెళ్లాను'' అన్నారు రాజమౌళి.
అలాగే ఈగ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ విశేషాలపై రాజమౌళి మాట్లాడుతూ ''మగధీర విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి ఎవరికివారు విడివిడిగా పనిచేశారు. ఆ తరవాత వీళ్లందరూ ఒక సంస్థగా ఏర్పడితే బాగుంటుందనే ఆలోచన ఫలితమే మకుట. ఇందులో అందరూ నిపుణులైన వ్యక్తులే. ఇంతకు ముందెప్పుడూ ప్రేక్షకులు చూడని విధంగా విజువల్ ఎఫెక్ట్స్ చేయగలిగితేనే విజయం లభిస్తుంది. ఆ విషయంలో మకుట బృందం విజయం సాధించింది. సాంకేతికంగా తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతుంది''అన్నారు.
బాలీవుడ్ ఎంట్రీ గురించి చెపుతూ..''తెలుగులో అంగీకరించిన సినిమాలు పూర్తి చేయడానికి నాలుగేళ్లుపడుతుంది. వాటి తరవాత ఆలోచిస్తాను''అన్నారు. త్రీడీలో ఈగ ఎప్పుడు విడుదలవుతుంది? అని మీడియావారు అడిగిన ప్రశ్నకు డి.సురేష్‌బాబు సమాధానమిస్తూ ''తక్కువ నాణ్యతతో త్రీడీ సినిమా చేస్తే వెంటనే పూర్తవుతుంది. ఉన్నతస్థాయి పరిజ్ఞానంతో ఈగని త్రీడిలో మార్చాలనుకుంటున్నాం. మనకున్న థియేటర్‌ల గురించి ఆలోచిస్తున్నాం. అందుకే ఆ వెర్షన్ విడుదలకు సమయం పడుతుంది''అన్నారు.
''ఈగ సినిమా కోసం 18 నెలలు కష్టపడ్డాం. కథలో భాగంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటే ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారో ఈగ నిరూపించింది. భారతీయ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మరింత సమర్థవంతంగా ఉపయోగంలోకి తీసుకురావడమే మా సంస్థ ధ్యేయం'' అన్నారు మకుట బృందంలో ఒకరైన పీటే డ్రాపర్. ఈ కార్యక్రమంలో సెంథిల్‌కుమార్, సాయి కొర్రపాటి పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











