శ్రీరామరాజ్యంకు గుమ్మడికాయ కొట్టేశారు..!?
బాలకృష్ణ శ్రీరాముడిగా బాపు దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. దాంతో నిన్న హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా సెట్లో గుమ్మడికాయ కొట్టేశారు (ఏ సినిమా షూటింగుకైనా ముందు కొబ్బరికాయ, చివర్లో గుమ్మడికాయ కొట్టడం అనాదిగా వస్తున్న ఆచారం). ఈ సందర్భంగా శ్రీరాముడి గెటప్ లో వున్న బాలకృష్ణకు చిత్రం యూనిట్ అంతా కలిసి పుష్పాభిషేకం చేశారు. తన సినీ కెరీర్ లో బాలకృష్ణ శ్రీరాముడి గెటప్ లో ఇదే మొదటిసారి.
ఈ సినిమా షూటింగును మొదటి నుంచి చివరి వరకూ ఓ యజ్ఞంలా నిర్వహించారనే చెప్పాలి. రామోజీ ఫిలిం సిటీలో దీని కోసం దర్బార్, రాజ్ మహల్ వంటి భారీ సెట్లు వేశారు. సీత పాత్రలో నయనతార, వాల్మీకిగా అక్కినేని నాగేశ్వర రావు, లక్ష్మణుడుగా శ్రీకాంత్ నటించారు. ఇళయరాజా దీనికి సంగీతాన్ని అందించడం ఓ విశేషం. యలమంచి సాయిబాబా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం ఆడియోను జూలై సెకెండ్ వీక్ లో విడుదల చేసి, ఆగష్టునెలలో రిలీజ్ చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











