Happy Birthday Sridevi: శ్రీదేవికి అరుదైన గౌరవం.. బర్త్ డే కానుక.. ఇలా ఇదే మొదటిసారి!
సినీ వెండితెరపై ఎనలేని స్థానం సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. అతిలోక సుందరిగా, దేవతగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మానవా (జగదేకవీరుడు అతిలోక సుందరి) అంటూ చిలిపిగా మాట్లాడిన, వీడిచ్చేదేంటి బోడి (క్షణం క్షణం) అని కోపంగా కసురుకున్న మరెవరిని రీప్లేస్ చేయనివిధంగా ఆమె ఆకట్టుకున్నారు. ఎన్నో వైవిధ్య పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న శ్రీదేవి 60వ పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 13). ఈ సందర్భంగా శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేస్తే..
భారతదేశం గర్వించదగిన గొప్ప నటీమణుల్లో ఒకరైన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. 1963 సంవత్సరంలో జన్మించిన ఆమె సినిమాలపై ఆసక్తితో నాలుగేళ్లప్పుడే సినీ ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగు పెట్టారు. కంధన్ కరుణై అనే తమిళ మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు. శ్రీదేవి పేరుతో మొదలైన ఆమె సినీ ప్రయాణం ఆకాశాన్ని తాకేలా చేసింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంతోపాటు హిందీలోనూ స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్నారు. భాషతో సంబంధం లేకుండా అనేక చిత్రాల్లో అగ్ర హీరోలందరితో నటించి వెండితెర క్వీన్ అనిపించుకున్నారు.

సినిమాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న శ్రీదేవి 2002 నుంచి బ్రేక్ ఇచ్చారు. 2004లో వచ్చిన మాలినీ అయ్యర్ అనే సీరియల్ తో బుల్లితెర రంగంలోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలోనే పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక 2012లో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత విజయ్ పులి (2015), మామ్ (2017) సినిమాలు మాత్రమే చేశారు. ఇక 2018, ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు దుబాయ్ లోని ఓ హోటల్ లో విగతజీవిగా కనిపించారు.

ఆగస్ట్ 13 శ్రీదేవి 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రోజున ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన డూడుల్ గా ఆమె ఫొటోను డిస్ ప్లే చేసింది. మంచి కలర్ ఫుల్ లుక్ లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న శ్రీదేవి ఫొటో దేవత సినిమా తరహాలో ఉంది. ఆమె చుట్టూ ఆకర్షణీయమైన పూలు, చేతి ముద్రలు, పండ్లతో శ్రీదేవి డూడుల్ అట్రాక్ట్ చేస్తోంది.

గూగుల్ ప్రదర్శించిన శ్రీదేవి డూడుల్ చిత్రాన్ని ముంబయికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ భూమిక వేశారు. శ్రీదేవికి ఇలా డూడుల్ ఘనత దక్కడం ఇదే తొలిసారి. కాగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్న శ్రీదేవికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు కుమార్తెలు అన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











