చార్మినార్ లో శ్రీహరి ‘టీ..సమోసా...బిస్కట్’
'టీ..సమోసా...బిస్కట్"....భాగ్యనగరంలో ప్రతి ఒక్కరి జీవితంతో పెనవేసుకుపోయిన మూడు ముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా దైనందిన జీవితంలో అలసిపోయిన పేదవాడు కాస్త మానసికోల్లాసం కావాలంటే వీటిని ఆశ్రయిస్తాడు. అలా నగర జీవితాన్ని ప్రతిబింబించేలా మా చిత్రానికి 'టీ..సమోసా..బిస్కట్" అనే పేరుపెట్టాం. చార్మినార్ నేపథ్యంలో కొందరి జీవితాల్లోని సంఘటనల సమాహారమే మా చిత్రం అంటున్నారు చిత్ర దర్శకుడు బాబ్జీ. శ్రీహరి, హంసానందిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ థియేటర్ పతాకంపై ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఇటీవల ఇరవై రోజుల పాటు జరిపిన షూటింగ్ లో నాయకానాయికలకు సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు కొంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చిత్రీకరించాం. తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. చార్మినార్ దగ్గరలోని ఓ ఇరానీ హోటల్ పరిసరాలలో జరిగే కథాంశమిది. ఇందుకోసం సారథి స్టూడియోలో భారీ వ్యయంతో ఓ సెట్ ను నిర్మించాం. రెండవ షెడ్యూల్ మొత్తాన్ని ఆ సెట్ లోనే చిత్రీకరిస్తాం. చిత్ర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటారు" అన్నారు. నరేష్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ, తనికెళ్ల భరణి, వాహిని,కవిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, రచన, నిర్మాత, దర్శకత్వం:బాబ్జీ.


Click it and Unblock the Notifications











