భార్య కేసు పెట్టడంపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందన ఇలా...
హైదరాబాద్: దర్శకుడు శ్రీను వైట్ల మీద ఆయన భార్య రూప కేసు పెట్టడం, పెద్దలు సర్ది చెప్పడంతో కేసు ఉపసంహరించుకోవడం తెలిసిందే. ఈ కేసు గురించి శ్రీను వైట్లను అడిగితే.. రూప కేసు పెట్టిన విషయం తనకు తెలియదని, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని తన భార్య తన వద్దే ఉందన్నారు.
శ్రీను వైట్ల భార్య రూప ని ఈ కేసు గురించి అడిగితే..కేసు నమోదైన విషయం తనకు తెలియదని..అసలు తాను ఫిర్యాదే చేయలేదన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని కలిసే ఉంటున్నామన్నారు. మరి నిప్పు లేకుండానే పొగరాదు అన్నట్లుగా ఫిర్యాదు చేయకుండానే ఇదంతా ఎలా జరిగిందో?
కేసు, ఉప సంహరణ వివరాలు ఇలా ఉన్నాయి...
తన భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రముఖ సినీదర్శకుడు శ్రీనువైట్ల సతీమణి సంతోషి రూప ఈ నెల 14న అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లింది.

శ్రీనువైట్ల మానసికంగా చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, భౌతిక దాడికి పాల్పిడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శ్రీను వైట్లపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల అనంతరం కేసు ఉపసంహరించుకున్నట్లు తన న్యాయవాది ద్వారా వాంగ్మూలాన్ని బంజారాహిల్స్ పోలీసులకు అందజేశారు. అయితే వారిద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో రూప తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు రూపను ఫోన్ ద్వారా సంప్రదించి విషయాన్ని నిర్ధరించుకున్నారు.
తాము కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నామని, తనకు ఎలాంటి వేధింపులు లేవని రూప స్పష్టం చేసినట్లు బంజారాహిల్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టులో సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications











