వర్మ, కోన, ప్రకాష్ రాజ్ లతో వివాదాలపై శ్రీను వైట్ల
హైదరాబాద్ : శ్రీను వైట్ల తాజా చిత్రం ఆగడు రీసెంట్ గా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యగ్యాత్మక ట్వీట్స్ అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ఆగడు చిత్రం విమర్శిస్తూ ఆయన ట్వీట్స్ చేసారు. దీని గురించి శ్రీను వైట్ల మీడియాతో మాట్లాడారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ...నాకు రామ్‌గోపాల్‌వర్మగారంటే చాలా ఇష్టం. అందుకే నా సినిమాల్లో ఆయన పేరును వాడుతుంటాను. 'ఆగడు' గురించి ఆయన ట్విట్టర్‌లో పెట్టిన కామెంట్స్ ఆయన ఇష్టం. దాన్ని నేనే పట్టించుకోవడం లేదు. ఇక ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారనుకోవడం లేదు. నేను అంతగా అభిమానించే దర్శకుడు గురించి, ఆయన స్పందన గురించి నేను మాట్లాడను అన్నారు.
మహేష్ హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ‘ఆగడు' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ రోజు (బుధవారం) శ్రీను వైట్ల పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో కాంట్రావర్శి గురించి, కోన వెంకట్ లేకపోవటం గురించి చెప్పిన విషయాలు స్లైడ్ షోలో....

ప్రకాష్ రాజ్ తో వివాదం గురించి
షూటింగ్ సమయంలో నాకు, ప్రకాష్‌రాజ్‌కి అభిప్రాయబేధాలొచ్చాయి. అందుకే ఆయన వెళ్లిపోయారు. ఈ విషయం ఇంతకంటే పెద్దది చేయడం ఇష్టం లేక వదిలేశాను. అప్పుడు మా ఇద్దరికీ అభిప్రాయభేదాలొచ్చాయి. ఆయన వెళ్లిపోయారు. తననెందుకు ఈ సినిమా నుంచి తీసేశారో క్లారిఫికేషన్ ఇస్తూ ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. నేను పెట్టలేదు. ఆ విషయాన్ని అప్పుడే వదిలేశాను. ఇప్పుడు కూడా ఆ విషయం గురించి మాట్లాడటం నాకిష్టం లేదు.

ప్రకాష్ రాజ్ కవితను ఆగడులో వాడటంపై ....
ఓ ప్రెస్‌మీట్‌లో ప్రకాశ్‌రాజ్ చెప్పిన కవితను ఇందులో విలన్ నోటివెంట ఉద్దేశపూర్వకంగానే చెప్పించారనే విషయంపై స్పందిస్తూ...(నవ్వుతూ) అదేమీ లేదండీ. ఆ పద్యం నాకు నచ్చింది. అందుకే దాన్ని విలన్‌కు పెట్టాను.

కోన వెంకట్ గురించి...
కోన వెంకట్ కావొచ్చు... మరొకరు కావొచ్చు..నేను రైటర్స్ గురించి ఎక్కువగా పట్టించుకోను. స్వతహాగా నేను రచయితను. దూకుడు చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ నాదే. ఎవరో రాసిన డైలాగ్స్‌కు నా పేరు వేసుకుంటానంటే రాసినవాళ్లు ఊరుకోరు కదా. మాటల రచయితగా కొత్తగా నేను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదనుకుంటున్నాను. ఆ తర్వాత ‘బాద్‌షా' కూడా చేశాను కదా. ఇప్పుడు ‘ఆగడు'కు ఈ రచయితలెలా పనిచేశారో, అప్పుడు ఆ రచయితలు ఆ సినిమాలకు పనిచేశారు. నేను సినిమాని సినిమాగా చూస్తాను. హీరో కేరక్టర్‌ను అలా డిజైన్ చేశాం కాబట్టి ఈ సినిమాకు డైలాగులు చాలా అవసరం.

‘దూకుడు'తో పోలిక
‘ఆగడు' చిత్రానికి తో ‘దూకుడు'తో పోలిక వస్తుందని ముందే ఊహించాం. ఆ కాంబినేషన్‌తో మళ్లీ సినిమా వస్తోందంటే అంబరాన్ని చుంబించే అంచనాలుంటాయి. ఈ సినిమాకి అదే జరిగింది. ప్రత్యేకించి టీజర్ రిలీజ్ చేశాక అంచనాలు రెట్టింపయ్యాయి. దాంతో ‘దూకుడు'తో పోలికలు రావడం సహజం. అయితే దానితో పోల్చకుండా ఉంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఎంజాయ్ చేస్తారు. చేస్తున్నారు. అందుకే ఓపెనింగ్స్ ఆ స్థాయిలో వచ్చాయి. ‘దూకుడు'లో హీరో పోలీసాఫీసర్‌గా ఓ సీన్‌లో కనిపిస్తాడు.

‘బాద్‌షా' తో పోలిక
‘బాద్‌షా'లో హీరో పోలీసాఫీసర్ అని సెకండాఫ్‌లో తెలుస్తుంది. కానీ ‘ఆగడు'లో హీరోది పూర్తి స్థాయి పోలీసాఫీసర్ రోల్. నిజానికి ఆ రెండు సినిమాల్లోని హీరో కేరక్టర్‌కూ, ఈ కేరక్టర్‌కూ సంబంధం ఉండదు. ఈ మూడు సినిమాలనూ నేనే డైరెక్ట్ చేసినందువల్ల ‘ఆగడు' సెకండాఫ్‌లో వాటి పోలికలున్నాయని కొంతమంది ఫీలయ్యారు అని అన్నారాయన.

ఆగడు పై వస్తున్న విమర్శలపై...
నేను చేసిన ఏ సినిమాలకూ రాని విమర్శలు ఈ సినిమాకి రావటానికి కారణం.. అంచనాలే. ‘దూకుడు' తర్వాత వస్తున్న కాంబినేషన్‌కు పీక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దాన్ని కాదనను. ఆ స్థాయిలో లేదనుకున్నప్పుడు విమర్శిస్తుంటారు. సగటు ప్రేక్షకులు అవేమీ పట్టించుకోరు కాబట్టి చూస్తున్నారు.

అందుకే మూస అనిపిస్తోంది...
సినిమా చేస్తున్నాను అంటే కథ గురించి ఎంత ఆలోచిస్తానో అందులో ముఖ్యంగా ఉండాల్సిన వినోదం గురించీ అంతే ఆలోచిస్తాను. ఆ ఆలోచనలో భాగమే విలన్ ఇంట్లోకి హీరో వెళ్లి అందరినీ బకరాలను చేయడం. నేను ప్రారంభించిన ఈ విధానం తర్వాత అందరూ వాడేయడంతో ఇప్పుడు ఏ సినిమా చూసినా ఒకేలా ఉన్నాయని అనిపిస్తోంది. నా గత మూడు సినిమాలు పోలీసు కథలు కావడం, మరికొన్ని అంశాల వల్ల నేను ఒకే ధోరణిలో వెళ్తున్నాను అని కొందరు అంటున్నారు. అయితే మూడు కథల విషయంలోనూ, హీరోల పాత్రల విషయంలోనూ చాలా తేడా ఉంటుంది.

భయంతోనే చేసాను...
ఒక్కో డైరెక్టర్‌కు ఒక్కో స్టయిల్ ఉంటుంది. అలాగే నాకంటూ ఓ స్టయిల్ ఉంది. మీరు ఫస్టాఫ్‌ను గమనిస్తే, పూర్తిగా నా శైలి నుంచి బయటకొచ్చి డిఫరెంట్‌గా వెళ్లానని అర్థమవుతుంది. నా ఫిలిమ్‌లాగా కాకుండా ఫ్రెష్ ట్రీట్‌మెంట్ చేసుకుంటూ వెళ్లాం. అది విపరీతంగా వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్‌కు వచ్చేసరికి నా మార్క్‌లేకపోతే డిజప్పాయింట్ అవుతారేమోననే భయంతో అలా చేశాం. అది కూడా వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్‌ను పోల్చి చెబుతుంది నా మునుపటి సినిమాలతోనే కదా. డెఫినెట్‌గా వాటి ధోరణి కనిపించి ఉండవచ్చు.

అలా జరగలేదు...
ఇది అందరికీ లాభాలు తీసుకొస్తుందనేది ఇప్పుడే నేను చెప్పలేను కానీ, ఇప్పటివరకూ ఈ సినిమాని కొన్న బయ్యర్లందరూ హ్యాపీగానే ఉన్నారు. రానున్న రోజుల్లోనూ ఈ సినిమా నిలకడగా ఆడుతుందని నాకు కానీ, మా నిర్మాతలకు కానీ, మా హీరోకి కానీ వంద శాతం నమ్మకం ఉంది. ఇప్పటికీ విడుదలైన అన్ని థియేటర్లలోనూ సినిమా ఆడుతోంది. అన్ని థియేటర్లలో విడుదల చేసినప్పుడు, డెఫిసిట్ వచ్చిందంటే తీసేస్తారు. కానీ అలా జరగలేదు.

ఐటం సాంగ్ గురించి...
శ్రుతి ఫెంటాస్టిక్ డాన్సర్. ఐటమ్ సాంగ్‌లో ఎవరినో పెట్టేకంటే ఆమె అయితే బాగుంటుందని ఫీలయ్యాను. ఆమె ఫామ్‌లో ఉన్న హీరోయిన్. ఇప్పటిదాకా స్పెషల్ సాంగ్ చెయ్యలేదు. నేను ఫోన్‌చేసి అడగ్గానే ఓకే అంది. ఆ పాటను చాలా స్పెషల్‌గా చేశాం. తను ఫెంటాస్టిక్‌గా డాన్స్ చేసింది. సెకండాఫ్‌కు ఆ సాంగ్ ప్లస్సయ్యింది.

డైలాగ్స్ ఎక్కువయ్యాయి...
చూసేవారికి ఏదో కొత్తదనం కావాలి. చాలా ఎఫర్ట్ పెట్టి, రిథమిక్‌గా, రైమింగ్‌తో ప్రతి డైలాగ్ ఉండాలనే ఉద్దేశంతో వాటిని రాశాం. ఎదుటివాళ్లను బురిడీ కొట్టించడానికి వాళ్లకు కథలు చెప్పడమనేదాన్ని పెట్టాం. అది బాగా వర్కవుట్ అయ్యిందని థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్‌ను బట్టి తెలుస్తోంది. చాలా పొడవు డైలాగ్‌తో ఆ కథ చెబుతుంటాడు హీరో. అవన్నీ సింగిల్‌షాట్‌లో, బ్రెత్‌లెస్‌గా ఉంటాయి. వాటిని ఓ రైమింగ్‌తో రిథమిక్‌గా మాడ్యులేట్ చేస్తూ చెప్పాలి. అది వెరైటీ అవుతుందని మహేశ్, నేను, మొత్తం యూనిట్ ఫీలయ్యాం. మహేశ్ టెర్రిఫిక్‌గా ఆ సీన్లు చేశారు.

గేమ్ సీన్స్...
అలాగే ఫస్టాఫ్‌లో 12 నిమిషాల గేమ్ షోను డిజైన్ చేశాం. మహేశ్‌బాబు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిశోర్ మీద చేసిన ఆ గేమ్‌షో హిలేరియస్‌గా ఉందంటున్నారు. అలా ప్రతి కేరక్టర్‌ను ఎంటర్‌టైనింగ్‌గా మలిచాం.

క్లైమాక్స్ లో బ్రహ్మానందం చేత డాన్స్ లు...
ఆగడు క్లైమాక్స్ లో బ్రహ్మానందం చేత కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి మరీ డాన్సులు చేయించటానికి కారణం...సినిమా అనేది ఒక వ్యాపారం..ఇక్కడ ఏది వర్కవుట్ అయితే అటే అందరూ వెళతారు. దానికి ప్రేక్షకుల అప్లాజ్ బాగుంది.

నెక్ట్స్ రామ్ చరణ్ తో సినిమా విషయమై...
‘ఆగడు' తర్వాత ఓ పెద్ద సినిమా చేయబోతున్నా. నా తర్వాతి సినిమాను ఓ వారంలో ప్రకటిస్తా. తర్వాతి సినిమాని ఇంకా కష్టపడి చెయ్యాలనుకుంటాను. హీరో ఎవరనేది అప్పుడే చెప్తా...నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు.

శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్రీను వైట్ల ఇలాంటి పుట్టిన రోజులు మరెన్ని జరుపుకోవాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











