'ఈగ' గురించి షారూఖ్ ఖాన్ ట్వీట్
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' హిందీలోకి 'మఖ్ఖీ' పేరున డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీమియర్ షో చూసి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన ఈగ గురించి ట్వీట్ చేస్తూ... "మక్కి చిత్రం రాజమౌళి అద్బుతంగా తెరకెక్కించారు. చాలా బాగుంది. అక్టోబర్ 12న విడుదల అవుతున్న ఈ చిత్రం..అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. రాజమౌళికి,టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ " అని అన్నారు.
ఈ విషయానికి రాజమౌళి స్పందిస్తూ... "@iamsrk the king khan ఎవరో తెలియని నాలాంటివ్యక్తి సినిమాని ప్రోత్సహిస్తూ ట్వీట్ చేసినందకు ధాంక్యూ... చాలా సంతోషంగా ఉంది. షారూఖ్ తన కుమారుడు మక్కి సినిమాని చూడాలని చాలా ఉత్సాహం చూపిస్తున్నాడని,వాళ్లిద్దరూ కలిసి మక్కిని చూస్తానని తనతో అన్నారని" అని ట్వీట్ చేసారు. 'ఈగ' త్వరలోనే బాలీవుడ్‌లో 'మఖ్ఖీ'గా వాలబోతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు బాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా గత కొన్ని రోజులుగా ముంబైలో 'మఖ్ఖీ' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే రాజమౌళి ఓ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి స్పందించారు. ''బాలీవుడ్‌లో 'ఈగ' ఫలితం ఎలా ఉంటుందా? అని ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే... తెలుగు ప్రేక్షకులకు ఈ కథ బాగా నచ్చింది. బాలీవుడ్‌లో అడుగుపెడితే కొత్త కథతోనే వెళ్లాలి. తెలుగులో నేను రూపొందించిన సినిమాల్ని రీమేక్ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే సినిమా అంటే రెండేళ్ల కష్టం. మళ్లీ అదే కథపై మరో రెండేళ్లు వెచ్చించడం నాకు నచ్చదు. బాలీవుడ్‌లో సినిమా తీయాలనుకొంటే కొత్త కథే రాసుకొంటా'' అన్నారు.
రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు ఈచిత్రాన్ని బాలీవుడ్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇక ''నాన్నా.. కథ చెప్పవూ..'' అనే సంభాషణతో సినిమా మొదలవుతుంది. ఆ నాన్న గొంతు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిదే. అక్కడ కూడా ప్రారంభ సన్నివేశంలో తండ్రీ కూతుళ్ల సంభాషణ వినిపిస్తుంది. అయితే ఈసారి కథను బాలీవుడ్ హీరో అజయ్‌దేవగణ్‌తో చెప్పించారు.


Click it and Unblock the Notifications











