‘ఈగ’ లాభాల్లో 22 లక్షలు చారిటీ కోసం...రాజమౌళి
హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం భారీ విజయం సాధించి మంచి లాభాలు తెచ్చి పెడుతుండటంతో లాభాల్లో కొంత మొత్తాన్ని చారిటీ కోసం డొనేట్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. లాభాల్లో రూ. 22 లక్షలు 'ప్రాజెక్ట్ 511' కోసం విరాళంగా ఇస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ఆసక్తి కలవారు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవాలసి కోరారు.
'ప్రాజెక్ట్ 511' అనేది హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని గవర్నమెంటు పాఠశాలల్లో కనీస ప్రాథమిక అవసరాలైన టాయ్ లెట్స్, బ్లాక్ బోర్డ్స్, బెంచీలు, మొబైల్ సైన్స్ ల్యాబ్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ లాంటి వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 62,000 వేలకు పైగా పిల్లలు 312 పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 'ది హైదరాబాద్ రౌండ్ టేబుల్ నెం.8 చారిటబుల్ ట్రస్ట్' ఈ ప్రాజెక్టును లీడ్ చేస్తోంది.
నాని, సుదీప్, సమంత ముఖ్య పాత్రలు పోషించిన ఈగ చిత్రం విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని భారీ లాభాలతో ముందుకు సాగుతోంది. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మాతగా డి.సురేష్ బాబు సమర్పణలో ఈ చిత్రం విడుదలైంది. ఈచిత్రం తర్వాత రాజమౌళి ప్రభాస్‌తో ప్రాజెక్టుకు సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











