రమా రాజమౌళికి యాక్సిడెంట్.. సంచలన విషయాన్ని బయటపెట్టిన జక్కన్న
డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కమర్షియాలిటీకి, హీరోయిజానికి దర్శకధీరుడి సినిమాలు నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన సినిమాల్లోని ప్రతి సీన్ ఓ క్లైమాక్స్‌లా ప్రేక్షకుడిని కుర్చీలో కుదురుగా కూర్చోనివ్వదు. సినిమా సినిమాకు టాలీవుడ్ పంథాను మారుస్తూ ఇప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమకే టార్చ్ బేరర్‌గా మారారు రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.
సినిమా మేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలను రాజమౌళీ సమూలంగా మార్చివేశారు. పాన్ ఇండియా కల్చర్‌ను భారతదేశానికి పరిచయం చేయగా.. ఇప్పుడు ఆయన వేసిన బాటలో ఎన్నో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కి బీటౌన్‌లో సౌత్ జెండాను ఎగురవేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న జక్కన్న.. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సినిమాలు తప్పించి రాజమౌళి పర్సనల్ లైఫ్ గురించి తెలిసింది అతి తక్కువ మందికే. తన సక్సెస్ వెనుక భార్య రమా రాజమౌళికే ఎక్కువ క్రెడిట్ ఇస్తారు జక్కన్న. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాకు రమానే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. కేవలం డిజైనర్ ఒక్కటే కాదు.. నటి, డ్యాన్సర్ కూడా. ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ.. భర్త, పిల్లలు, పనికే ప్రాధాన్యత ఇస్తారు. వాస్తవానికి రాజమౌళిని పెళ్లి చేసుకోవడానికంటే ముందే రమాకు పెళ్లయ్యింది.
ఆమె మొదటి భర్త కొడుకే కార్తికేయ. అయితే కొన్ని కారణాల వల్ల రమ తన మొదటి భర్త నుంచి విడిపోయారు. ఈ క్రమంలో కీరవాణి కారణంగా రాజమౌళితో పరిచయం ఏర్పడింది. శాంతి నివాసం సీరియల్ టైంలో రమాకు, రాజమౌళికి మధ్య పరిచయం ఏర్పడి.. స్టూడెంట్ నెంబర్ .1 నాటికి అది ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరి బంధం ఎలాంటిదంటే .. రమకు అప్పటికే కార్తికేయ ఉండటంతో మళ్లీ పిల్లలు కావాలని రాజమౌళి కోరుకోలేదట. అంతేకాదు మయూఖ అనే పాపను దత్తత తీసుకుని ఈ జంట పలువురికి ఆదర్శంగా నిలిచింది.

అలాంటిది ఒకానొక సమయంలో రమా రాజమౌళి పెద్ద ప్రమాదానికి గురై, కోలుకోవడానికి ఎంతో సమయం పట్టిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల జక్కన్న జీవితంపై '' మోడ్రన్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి '' పేరిట డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో దర్శకధీరుడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రమకు జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావించారు.
మగధీర షూటింగ్ సమయంలో ఓ మారుమూల ప్రాంతంలో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా పెద్ద యాక్సిడెంట్ జరిగి.. అందరికీ గాయాలయ్యాయని రాజమౌళి తెలిపారు. రమకి నడుము కింద స్పర్శ పోయిందని.. దాదాపు పక్షవాతం వచ్చిందని అనుకున్నామని , దగ్గరిలో ఆసుపత్రి కూడా లేకపోవడంతో జక్కన్న తెలిసిన డాక్టర్స్ అందరికీ ఫోన్లు చేస్తూ, భార్యని ఆ స్థితిలో చూసి ఏడ్చేశారట. అనంతరం రమను ఎలాగోలా ఆసుపత్రిలో చేర్చగా, ఆమె నెమ్మదిగా కోలుకున్నారని రాజమౌళీ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











