SS Rajamouliకి ప్రతిష్టాత్మక NYFCC అవార్డు.. ప్రపంచవేదికపై సత్తా చాటిన జక్కన్న!
దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన అద్భుతమైన కళాఖండం RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ఎల్లలు దాటింది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ. 1200కుపైగా కోట్లు కలెక్ట్ చేసింది. కలెక్షన్ల పరంగానే కాకుండా ఈ సినిమాను ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. వెరైటీ మ్యాగజైన్ లో తారక్ టాప్ 10లో చోటు దక్కించుకోగా డైరెక్టర్ రాజమౌలి అరుదైన అవార్డు అందుకున్నారు.

బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా RRR. ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట మొదలైంది. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా తాజాగా వెరైటీ మ్యాగజీన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా టాప్ 10 స్థానం దక్కించుకుని ఘనత సాధించాడు. అలాగే ఇదివరకు బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఎన్నికయ్యారు రాజమౌళి. ఇప్పుడు ఆ అవార్డును అందుకుని మరోసారి తెలుగు ఖ్యాతిని విస్తరింపజేశారు.
చాలా ఆశ్చర్యంగా ఉంది..
న్యూయార్క్ లో జరిగిన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) కార్యక్రమంలో ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు దర్శక దిగ్గజం రాజమౌళి. ఈ కార్యక్రమానికి రాజమౌళి తన భార్య రమ, కుమారుడు కార్తికేయతో కలిసి వేడుకకు హాజరయ్యారు. అవార్డు అనంతరం తనదైన శైలీలో ఇచ్చిన ప్రసంగం విదేశీయులచేత చప్పట్లు కొట్టించింది. అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. "ప్రస్తుతం దక్షిణాది నుంచి వస్తున్న చిన్న సినిమాలను కూడా గుర్తించేలా చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. భారతదేశంలో RRR చిత్రానికి ఎలా రియాక్ట్ అయ్యారో ఇక్కడ కూడా అలాంటి స్పందనే రావడం ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా ఒక కారణం" అని తెలిపారు.
1935 నుంచి అవార్డులు..
ఇక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల విషయానికొస్తే.. ప్రతి ఏడాది వివిధ వార్తా పత్రికలు, మ్యాగజైన్స్, ఆన్ లైన్ మీడియా సంస్థలకు చెందిన క్రిటిక్స్ ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డులు అందిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అత్యున్నతమైన ప్రతిభ కనబర్చిన వారికి దాదాపుగా 1935 నుంచి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు అందిస్తోంది. ఈ అసోసియేషన్ లో పలు వార్తా పత్రికలకు చెందిన 30 మంది క్రిటిక్స్ జ్యూరీ సభ్యులుగా ఇస్తుంటారు. వారంతా కలిసి కొన్ని సినిమాలను ఎంపిక చేసి ఏ చిత్రానికి ఏ క్యాటగిరిలో అవార్డు ఇవ్వాలో చర్చించి ఇస్తుంటారు. దాదాపుగా ఆస్కార్ రేంజ్ లో ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో పైజామాతో భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా రాజమౌలి వేషధారణ ఉంది.


Click it and Unblock the Notifications











