తొలి సూర్య కిరణం తాకే చోట బాహుబలి2.. మరో చరిత్రకు సిద్ధం..
ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని వ్యాప్తింపజేసిన బాహుబలి మరోసారి చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నది. ఈ చిత్రం డిసెంబర్ 29వ తేదీన జపాన్ భాషలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే సెన్సార్ పనులను పూర్తి చేసుకొన్న బాహుబలి చిత్రం జపాన్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. జపాన్‌లో భారతీయ చిత్రాలకు ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్ చిత్రాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరంధం పడుతారు. ఇలాంటి నేపథ్యంలో విడుదలవుతున్న బాహుబలికి అక్కడి సినీ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Recommended Video


బాహుబలి ప్రభంజనం
ప్రభాస్, రానా దగ్గుబాటి నటించిన బాహుబలి చిత్రాలు తెలగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకి అనువాదం చేశారు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి క్రేజ్ లభించినందున ఈ చిత్రాన్ని జపాన్ భాషలో అనువాదం చేసి రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు.

1700 కోట్లు కొల్లగొట్టిన రాజమౌళి
బాహుబలి2 చిత్రం తొలిసారి 1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసింది. కేవలం తమిళనాడులో గతంలో ఏ తెలుగు చిత్రం వసూలు చేయని విధంగా 150 కోట్ల రూపాయలను వసూలు చేయడం గమనార్హం. కేవలం 16 రోజుల్లోనే తమిళ బాహుబలి 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం అక్కడ ఓ రికార్డు.

జపాన్‌లో మరో చరిత్రకు సిద్దం
ఇక మలయాళంలో రూపొందిన బాహుబలి2 చిత్రం కేరళవ్యాప్తంగా రూ.70 కోట్లు వసూలు చేసింది. పలు చోట్ల బాలీవుడ్ చిత్రాలు సుల్తాన్, దంగల్ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన బాహుబలి జపాన్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.

బాహుబలికి జీ సర్టిఫికెట్
జపాన్ భాషలోకి అనువాదం చేసిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రానికి జీ సర్టిఫికెట్ లభించింది. అక్కడ జీ సర్టిఫికెట్ భారత్‌లో యూ సర్టిఫికెట్‌కు సమానం. రజనీకాంత్ చిత్రాలకు ధీటుగా బాహుబలి2 కలెక్షన్లు సాధిస్తుందా అనేది త్వరలోనే తెలియడం ఖాయం.


Click it and Unblock the Notifications











