RRR: ఆస్కార్ కోసం 80 కోట్లు కాలేదు.. అసలు లెక్కపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి కొడుకు!
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా ద్వారానే రాజమౌళి ఆస్కార్ వరకు వెళ్లడం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
నాటు నాటు పాటకు ఆస్కార్ తో తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినట్లయింది. అయితే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి టీమ్ దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంలో ఆయన తనయుడు కార్తికేయ అసలు లెక్క గురించి వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆస్కార్ కోసం 80 కోట్లు అంటూ..
ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించారు. అయితే అదే సమయంలో ఆస్కార్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టారన్న విమర్శలు వచ్చాయి. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారు సైతం ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ డబ్బుతో కొన్ని సినిమాలు తీయవచ్చని చెప్పడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.

కార్తికేయ క్లారిటీ
ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా 80 కోట్లు పెట్టి ఆస్కార్ కొన్నారన్న ఆరోపణలూ వచ్చాయి. అయితే వీటన్నింటికి చెక్ పెట్టాడు ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్, ఆస్కార్ క్యాంపెయిన్ ను ముందుండి నడిపించిన రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ.. అసలు ఆస్కార్ క్యాంపెయిన్ కు ఎంత ఖర్చు అయిందో చెప్పాడు.

దానయ్యతో విబేధాలు
ముందుగా అయితే డివివి.దానయ్యను కావాలనే దూరం పెట్టారు అనే విధంగా కొన్ని వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే విషయంలో కార్తికేయ ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ఈ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముఖ్య కారణం దానయ్య గారు అని కార్తికేయ ప్రత్యేకంగా ట్వీట్ చేయడంతో వారి మధ్య కూడా ఎలాంటి విభేదాలు లేవని అర్థమైపోయింది.

ఫస్ట్ అనుకున్న బడ్జెట్
అలాగే ఆస్కార్ క్యాంపెయిన్ చేయడం కోసం హాలీవుడ్ సినిమా వాళ్లు పలు స్టూడియోలను ఆశ్రయిస్తారని, కానీ తమకు అలాంటి ఆస్కారం లేదని కార్తికేయ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్వయంగా తామే క్యాంపెయిన్ చేసుకున్నామని, అందుకోసం మొదట తాము అనుకున్న బడ్జెట్ కేవలం రూ.5 కోట్లేనని కార్తికేయ చెప్పాడు.

మొత్తం ఖర్చు ఎంతంటే
అది కూడా ఎక్కువ అనిపించి వీలైనంత వరకు తగ్గిద్దామని ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే నాటు నాటు పాటకు నామినేషన్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ పెంచి క్యాంపెయిన్ చేసినట్లు చెప్పాడు. మొత్తం ఆస్కార్ క్యాంపెయిన్ కు ఐదారు కోట్లు అవుతుందని అనుకున్నప్పటికీ.. చివరికి రూ.8.5 కోట్లు అయిందని కార్తికేయ అసలు ఫిగర్ చెప్పాడు.

ప్రేమను డబ్బుతో కొనలేమని..
న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లో మరిన్ని స్క్రీనింగ్స్ వేయాల్సి వచ్చిందన్నాడు. అయితే RRR సినిమాను నాన్ ఇండియన్స్ బాగా ఆదరించారని చెప్పాడు కార్తికేయ. సినిమాపై ప్రేమ, గౌరవంతో ప్రేక్షకులు తమకు ఉచిత ప్రమోషన్ చేశారని అన్నాడు.
ఆస్కార్ ను డబ్బులు పెట్టి కొన్నారని అనడం పెద్ద జోక్ అని కార్తికేయ చెప్పాడు. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి ఇన్ స్టిట్యూయష్ అది అన్నాడు. ఆడియన్స్ ప్రేమను డబ్బుతో కొనలేమని, స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనలేం కదా అని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











