పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి వేరేగా చెప్పాల్సిన పని లేదు. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడుతో మొదలైన వీళ్ల కుటుంబ సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక, ఈ ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తోన్నారు విక్టరీ వెంకటేష్. తాజాగా ఆయన కుమార్తె వివాహం హైదరాబాద్‌లో జరిగింది. మరి ఈ పెళ్లి ఎలా జరిగింది? దీనికి ఎంత మంది గెస్టులు వచ్చారు? టాలీవుడ్ నుంచి ఏఏ హీరోలు హాజరయ్యారు? అనే విషయాలను చూద్దాం పదండి!
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహినీ వివాహం శుక్రవారం రాత్రి విజయవాడకు చెందిన డా. పాతూరి వెంకటరామారావు, డా. అరుణ దంపతుల కుమారుడు నిషాంత్‌తో చాలా సింపుల్‌గా జరిగింది. హైదరాబాద్ నగరంలోని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో పెద్దలు నిశ్చయించినట్లుగా రాత్రి 9.36 గంటలకు నిషాంత్.. హయవాహినీ మెడలో మూడు ముళ్లు వేశాడు.

హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో చాలా నిడారంబరంగా జరిగిన హయవాహినీ - నిషాంత్ వివాహానికి ఇండస్ట్రీలోని ప్రముఖులను తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఈ పెళ్లిని మాత్రం ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల మధ్యనే జరిపించారు.
హయవాహినీ - నిషాంత్ వివాహానికి సినీ రంగం నుంచి స్టార్లు ఎవరూ హాజరు కాకపోయినా దగ్గుబాటి, అక్కినేని హీరోలు మాత్రం వచ్చారని తెలిసింది. ముఖ్యంగా దగ్గుబాటి రానా, అక్కినేని నాగ చైతన్య, అఖిల్, అభిరామ్‌లు ఈ వివాహ వేడుకలో సందడి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వెంకటేష్‌కు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అందులో రెండో కుమార్తెనే ఈ హయవాహినీ. గతంలో పెద్ద కుమార్తె పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో హయవాహిని నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, దగ్గుబాటి రానా, అక్కినేని నాగచైతన్య సహా చాలా మంది హాజరై హయవాహినీ - నిషాంత్‌ను ఆశీర్వదించారు. అయితే, ఇప్పుడు ప్రముఖుల కోసం ఏదైనా రిసెప్షన్ వంటిది ఏర్పాటు చేస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











