‘స్టార్ హీరోల వల్లే సినీ పరిశ్రమలో సంక్షోభం.. సినిమా థియేటర్ల మూసివేతకు వారే కారణం’
తెలుగు సినిమా పరిశ్రమలో పర్సెంటేజ్ విధానం తీవ్రమైన సమస్యగా మారబోతున్నాదా? అంటే అవుననే వాదన వినిపిస్తున్నది. ఈ వివాదంపై ప్రముఖ డిస్టిబ్యూటర్ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తెలుగు సినిమా రంగంపై ప్రభావం చూపబోతున్నదనే ఆందోళన సినీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ వివాదం గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. సినీ ప్రముఖులు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అయితే ఈ వివాదంపై ఏపీ మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీశాయి. పర్సంటేజ్ విధానం అంటే ఏమిటి? అలాగే అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ అనే రెండు వ్యవస్థలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల కోసం వసూలయ్యే కలెక్షన్లలో పర్సంటేజ్ ప్రకారం అద్దె చెల్లించే ఆనవాయితీ వస్తున్నది. ఈ పర్సంటేజ్ తొలివారం ఓ రకంగా అంటే 60 - 40 రేషియోలో, రెండు, మూడు వారాలకు ఓ రకంగా ఉంటుంది. సింగిల్ థియేటర్లకు కేవలం అద్దె మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే పర్సంటేజ్ పద్దతిని కూడా సింగిల్ థియేటర్లకు వర్తింప చేయాలనే డిమాండ్‌ను డిస్టిబ్యూటర్లు తెరపైకి తెచ్చి నిర్మాతలపై ఒత్తిడి పెంచారు.

తెలుగు సినిమా పరిశ్రమలో దిల్ రాజు, ఏషియన్ సురేష్, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, యూవీ, సితారా లాంటి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇండస్ట్రీపై పట్టు సాధించాయి. ఈ సంస్థల చెప్పు చేతల్లోనే సినిమాల భవిష్యత్ ఉందనే విమర్శ కూడా వస్తున్నది. అలాగే ఆ నలుగురు అంటూ కొందరు చిన్న నిర్మాతలు ప్రముఖ సంస్థలపై ఆరోపణలు కూడా చేశారు. అయితే ఈ సంస్థల మధ్యే వివాదం నెలకొనడం ఇండస్ట్రీలో వివాదానికి దారి తీసింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నైజాం, ఆంధ్రాలో థియేటర్లపై పట్టు ఉన్న డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మాత్రం సింగిల్ థియేటర్లకు పర్సంటేజ్ విధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌కు చెల్లించిన విధానం ప్రకారమే.. సింగిల్ థియేటర్లకు వసూళ్లలో పర్సంటేజ్ విధానంలో అద్దె గానీ, కమిషన్ గానీ చెల్లించాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. అయితే ఈ విధంగా చెల్లించకపోతే.. జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ థియేటర్లను మూసి వేస్తామని బంద్‌కు పిలుపునిచ్చారు.
ఇలాంటి వివాదం కొనసాగుతుంటే.. మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్లు మూత పడటానికి కారణం స్టార్ హీరోలే. సినీ పరిశ్రమ అభివృద్ధికి పెద్ద హీరోలు, సూపర్ స్టార్స్ నైతిక బాధ్యతను తీసుకోవడం లేదు. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేయాలని ఎన్నోసార్లు చెప్పాం. కానీ వారు రెండేళ్లకు, మూడేళ్లకు ఓ సినిమా చేస్తుంటే సినిమా పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతున్నది. సినిమా థియేటర్లు మూత పడటానికి కారకులు అవుతున్నారు అని అంబికా కృష్ణ విమర్శలు చేశారు.


Click it and Unblock the Notifications











