సాయికుమార్ కొడుకు 'సుకుమారుడు' స్టోరీ లైన్
హైదరాబాద్ : సాయికుమార్ కుమారుడు ఆది తాజాగా 'సుకుమారుడు' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్ల జమీందార్ దర్సకుడు జి.అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్టోరీ లైన్ ప్రకారం...వయసు మళ్లిన మనసుకి సాంత్వన కలిగించేవి అనుబంధాలూ, ఆప్యాయతలే. బతుకు బడిలో పాఠాలుగా నేర్చుకొన్న అనుభవాలను తమ వారసులకు చెప్పాలని తాపత్రయపడతారు. తప్పటడుగులు వేయకుండా... జాగ్రత్తపడతారు. వీళ్లూ అదే చేశారు.
అమెరికా నుంచి వచ్చే తమ ముద్దుల మనవడికి తెలుగు పద్ధతులు నేర్పించాలనుకొన్నారు. మన సంప్రదాయాలు గుర్తు చేద్దామనుకొన్నారు. ఆ మనవడు రానే వచ్చాడు. మరి తాతయ్య, నాన్నమ్మల కోరిక ఫలించిందా? మనవడికి మన సంప్రదాయం నచ్చిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే. అమెరికా నుంచి వచ్చిన మనవణ్ని చూసిన ఆ పెద్దాయనకు తన టీనేజ్ గుర్తుకొచ్చింది. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన ఆ అబ్బాయికి తెలుగుదనాన్ని ఎలా రుచి చూపించారు? ఇక్కడి పద్ధతులకు ఆ అల్లరి కుర్రాడు అలవాటుపడ్డాడో లేదా అనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందుతోంది.
నిర్మాత మాట్లాడుతూ ''ఉగాది పచ్చడిలాంటి సినిమా ఇది. అన్ని రుచులూ ఉంటాయి. కృష్ణ, శారదలు పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయ''అని చెప్పారు. ఆది, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. కృష్ణ, శారద కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
నీలం ఉపాధ్యాయ, సూపర్‌స్టార్ కృష్ణ, శారద, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, అజయ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సాయిశ్రీరామ్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: చంద్రశేఖర్ గుండిమెడ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ జి.


Click it and Unblock the Notifications











