ఎ.ఆర్.మురుగదాస్ కొత్త చిత్రం 'తుపాకి' స్టోరీ లైన్
హైదరాబాద్ : విజయ్, కాజల్ జంటగా తమిళంలో నటించిన చిత్రం 'తుపాకి'. తెలుగులోనూ అదే పేరుతో అనువాదమై విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం కథ గురించి తెలుగు నిర్మాత శోభారాణి మాట్లాడుతూ ''ముంబయిలో స్థిరపడిన ఓ ఆర్మీ అధికారి కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది. సెలవుల నిమిత్తం 60 రోజులు సొంత ఊర్లో ఉంటాడు.అక్కడ అతను అనుకోని పరిస్థితుల్లో తుపాకి చేతపడతాడు. ఆ రెండునెలల్లో అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయ్...ఆ తరవాత ఏమైందన్నది తెర మీదే చూడాలి. ఈ నెల 22న పాటలు విడుదల చేసా ము''అన్నారు.
ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్వీఆర్ మీడియా అధినేత సీజే శోభా చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'తన ప్రతి చిత్రాన్ని ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించే మురుగదాస్ ఈ చిత్రాన్ని కూడా ఓ వండర్‌లా తీర్చిదిద్దుతున్నాడు. త్వరలోనే పాటలను విడుదల చేసి దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుంది' అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మాటలు: శ్రీరామకృష్ణ.


Click it and Unblock the Notifications











