అలాంటి పరిస్దితి మళ్లీ రాదనుకుంటున్నా: మహేష్ బాబు
ఒక విషయంలో మాత్రం దూకుడు నాకు చాలా హెల్ప్ చేసింది. మొన్నటిదాకా పోకిరి చట్రంలో ఇరుక్కుపోయాన్నేను. ఆ ఇమేజ్ నుంచి బయటపడేసిన చిత్రం దూకుడు . పోకిరి రికార్డుని బ్రేక్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఒక్క పాత్రలో ఇన్ని షేడ్స్ పోషించాను కాబట్టి.. ఇక ఎలాంటి పాత్ర అయినా పోషించగలనన్న నమ్మకం నాకు దూకుడు కలిగించింది అన్నారు మహేష్ బాబు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన దూకుడు సక్సెస్‌మీట్‌లో మహేష్ సందడి చేశారు. ముంబయిలో ద బిజినెస్‌మ్యాన్ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న మహేష్, ఈ సక్సెస్ మీట్ కోసమే హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది యూనివర్శల్ స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి.
నా కెరీర్‌లోనే దూకుడు బెస్ట్ స్క్రిప్ట్‌గా చెప్పగలుగుతాను. అన్ని ఎమోషన్లు పలికించడానికి ఈ కేరక్టర్ నాకు అవకాశం కల్పించింది అన్నారు. పోకిరి చిత్రం అనంతరం మహేష్ నటించిన సినిమాలేవి ఆడలేదు. దూకుడు చిత్రం తోనే ఆయన తిరిగి ఫామ్ లోకి వచ్చారని చెప్పాలి. అలాగే ఫస్ట్ టైమ్‌లో ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించడం మంచి అనుభూతినిచ్చింది అన్నారు. ఆ పాత్ర గురించి మాట్లాడుతూ.. కొత్తగా ఉంది. సినిమాకి హైలైట్ అవుతుందని అందరం అనుకున్నాం. నా మెడలో పులిగోరు, వైట్ అండ్ వైట్ డ్రస్ అందరికీ నచ్చింది. నాక్కూడా బాగా నచ్చింది అన్నారు. 3 ఇడియట్స్ ఓవర్‌సీస్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. నంబర్ 2 ప్లేస్‌లో దూకుడు ఉంది. పది కోట్లకు పైనే అక్కడ వసూలు చేసింది ఈ సినిమా. మన దగ్గర నైజాం కలెక్షన్లతో సమానంగా ఓవర్‌సీస్‌లో వసూలు చేసింది. మన తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











