స్టూడెంట్ స్టోరీ 'మారో'!
నితిన్‌ని 'మారో' అని మీరాచోప్రా తన స్నేహితురాళ్ళతో అంటుందో, మీరాచోప్రాని 'మారో' అని తన బృందంకి నితిన్ పురమాయిస్తాడో ఇద్దరూ మారో, మారో అనుకుంటారో తెలీదు గాని మొత్తానికి విద్యార్థి జీవితానికి సంబంధించిన ఇతివృత్తంగా రూపొందించి నట్టున్నారు 'మారో' చిత్రాన్ని. ఈ చిత్రంలో వడ్డీ వ్యాపారస్థులు కూడా వున్నారంటే ఆర్థిక మాంద్యం గురించో, బుణబాధల గురించో చిత్రీకరణ కూడా సాగి వుంటుంది. ఈ పాత్రల పోషించింది రఘుబాబు, అలీ కనుక నవ్వులు పండించే సన్నివేశాలూ వుంటాయి.
ఈ మధ్య మైండ్ గేమ్ అని గీతాకృష్ణ తన 'కాఫీ బార్' చిత్రం గురించి తరుచు చెబుతూంటే ఈ చిత్ర దర్శకుడు సిద్దిక్ కూడా 'మైండ్ గేమ్' నే ఎత్తుకుని, ఈ మైండ్ గేమ్‌తో ఎదుటవారిని ఎలా చిత్తు చేయాలో చూపించామని అంటున్నారు. మలయాళ, తమిళ భాషల్లో తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్దిక్ తొలిసారి తెలుగులో డైరక్ట్ చేసిన చిత్రం 'మారో'. ఐ.ఐ.టి విద్యార్థిగా జీవితంలో ఎదురైన సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వాటిని మైండ్ గేమ్‌తో పరిష్కరించానని నితిన్ అంటున్నాడు. గతంలో మూడొంతులు పూర్తయి గ్యాప్ తీసుకున్న 'సత్యం శివం సుందరం' - 'మారో' గా వస్తోంది.


Click it and Unblock the Notifications











