కలర్స్ స్వాతి హీరోయిన్ గా తమిళంలో చేసిన 'సుబ్రమణ్యపురం' చిత్రం సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పడా చిత్రం 'అనంతపురం' టైటిల్ తో తెలుగులోకి అనువాదమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎమ్.రంగనాథ్ మాట్లాడుతూ "1980 సంవత్సరంలో జరిగిన సంఘటనలే మా చిత్ర కథ. నాటి వాతావరణాన్నీ, జీవన శైలినీ ప్రతిబింబిస్తుంది. అప్పటి యువకుల కేశాలంకరణలు, దుస్తుల్లో ఫ్యాషన్స్, అప్పటి సంగీతం...అన్నీ తెర మీద కనిపిస్తాయి. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. అనంతపురం అనే పేరు ఉందని ఇదేదో ఫ్యాక్షన్ సినిమా అనుకోవద్దు. ప్రేమ, పగ, స్నేహం అనే అంశాల చుట్టూ తిరుగుతుందీ చిత్రం" అన్నారు. ఇక ఈ చిత్రానికి శశికుమార్ దర్శకుడు. మిగతా పాత్రల్లో జై, సముద్రకన్ని, గంజా కరుప్పు చేసారు. నెలాఖరున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.