»   » హద్దుల్లేని అభిమానం: అశోక్ తేజకు సన్మానం

హద్దుల్లేని అభిమానం: అశోక్ తేజకు సన్మానం

Subscribe to Filmibeat Telugu

అద్భుతమైన కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులకు జన్మనిచ్చిన తెనాలికి వందనమని ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. ఇక్కడి రెడ్‌ క్రాస్‌ కళాప్రాంగణంలో ఆదివారం రాత్రి బొల్లిముంత స్మారక నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అభ్యుదయ సినీరచయిత బొల్లిముంత శివరామకృష్ణ కళాపురస్కారాన్ని అశోక్‌తేజకు ప్రదానం చేశారు. ఎన్నారై చందు సాంబశివరావు రూ.10,116 బహూకరించారు. బొల్లిముంత స్మారక సమితి నిర్వహణలో జరిగిన సభకు నాటకోత్సవాల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు, 'వివేక' డైరెక్టర్‌ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. అవార్డు స్వీకరించిన అనంతరం అశోక్‌ తేజ కృతజ్ఞతాపూర్వక ప్రసంగం చేశారు.

తెనాలిలో ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణ పొందగలిగిన పద్యనాటకానికి ప్రపంచంలో తిరుగుండదనే వాస్తవాన్ని తాను విని ఉన్నట్టు చెప్పారు. తెనాలి ప్రజలు సాధారణ విషయాలకు చప్పట్లు కొట్టరని, ఎక్కడో హృదయంలో ఉండే జీవనాడిలోకి వెళ్లి అక్కడ కూడా సున్నితమైన మూలాల్ని తట్టగలిగితేనే చప్పట్లు వస్తాయని విన్నానన్నారు. చలం, కొ.కు. జీవీకే, శారద వంటి మహా రచయితలు, త్రిపురనేని రామస్వామి, కాంచనమాల, భిక్షావతి, వంగర వంటి మహామహులు నడయాడిన తెనాలి గడ్డకు వందనమని అశోక్‌తేజ పేరుపేరునా చెప్పారు.

1967లో తరిమెల నాగిరెడ్డి ఉపన్యాసపు హోరులో శివమెత్తిన ప్రాంతంగా కూడా తెనాలి ఖ్యాతిగాంచిందన్నారు. మూడుసార్లు ఊర్వశి అవార్డు అందుకున్న శారద తెనాలి వారేనని చెబుతూ, కోస్తాలో పుట్టి తెలంగాణ మట్టిమనుషుల జీవి తాల్ని 'మృత్యుంజయులు'గా రచించిన బొల్లిముంత శివరామకృష్ణ పేరిట అవార్డును తనకు ప్రదానం చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన జ్ఞాపికతో శివరామకృష్ణ భౌతికమైన జీవితాన్ని తన ఇంటికి తీసుకెళుతున్నానని చెప్పుకొన్నారు. బొల్లిముంత వివిధ సినిమాల్లో రాసిన మాటలు, పాటలను ప్రస్తావిస్తూ సభికులను రంజింపజేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu