మహేష్‌బాబు కూడా నాకు షాక్ ఇచ్చారు(ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : ఓసారి మహేష్‌బాబు కూడా నాకు షాక్ ఇచ్చారు. ఆ రోజు ఓ ఫ్లోరులో మహేష్ షూటింగ్ జరుగుతోంది. రెండో ఫ్లోరులో గౌతమ్‌పై సీన్స్ తీస్తున్నాం. మహేష్ షూటింగ్ స్పాట్‌లో కార్ వాన్ లేదు. ఎక్కడుంది? అని ఆరా తీస్తే.. అది గౌతమ్ షూటింగ్ జరుగుతున్న చోట ఉంది. మహేష్ ఓ సూపర్ స్టార్. ఆయన కోసం కార్ వాన్ ఉండాలి. కానీ ఇక్కడ ఆయన స్టార్‌లా కాదు... తండ్రిలా ఆలోచించి.. తన కొడుకు దగ్గరకు దాన్ని పంపారు అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు. ఆయన మహేష్‌బాబుని '1'గా చూపిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుకుమార్ చెప్పిన సంగతులివి.
ఆయన దర్శకత్వం వహించిన '1' నేనొక్కడినే శుక్రవారం విడుదల కానుంది, శనివారం సుకుమార్ పుట్టినరోజు కావడం గమనార్హం. మహే శ్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా '1'నేనొక్కడినే. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా ఇది. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ఈ సినిమా గురించి సుకుమార్ మీడియాతో మాట్లాడారు.
"నా కథల్లో వినోదాన్ని ప్రత్యేకంగా పొందుపరచడానికి ఇష్టపడను. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది సెపరేట్‌గా ఉంటుందని నేను నమ్మను. సినిమాల్లో సన్నివేశానుగుణంగా వచ్చే కామెడీ, సెంటిమెంట్‌తో ముడిపడిందే ఎంటర్‌టైన్‌మెంట్. కొన్ని సార్లు తెరపై పాత్రలు ఏడుస్తున్నా, అందులోనూ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది'' అన్నారు సుకుమార్.
ఇంకా సుకుమార్ ఏమన్నారు..అనే విషయాలు స్లైడ్ షోలో..

'1' - నేనొక్కడినే అనే టైటిల్
చాలా టైటిళ్లు అనుకొన్నాం. అవన్నీ ఒక పేపర్‌పై రాసుకొన్నాం. చివరికి ఇది ఎంపిక చేశాం అన్నారు సుకుమార్. "1 అనే టైటిల్ కథ ప్రకారమే పెట్టాం. ముందు టైటిల్‌ని అనుకుని కథను ప్రారంభించలేదు. సినిమా మొదలయ్యాక మా డైరక్షన్ డిపార్ట్‌మెంట్ అంతా కూర్చుని కొన్ని టైటిల్స్ రాశారు. అందులో ఈ టైటిల్ నచ్చి పెట్టాం. ఈ టైటిల్‌ను ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలు ఉండవు. పాజిటివ్ యాంగిల్స్ ఉంటాయి.

ఎమోషనల్ థ్రిల్లర్
ఇది థ్రిల్లర్ చిత్రమే... అయితే... కమర్షియల్ హంగులున్న థ్రిల్లర్. ఓ స్టార్ సినిమా అంటే ఏమేం ఉంటాయో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. వాటితో పాటే ప్రేక్షకులు వూహించని సంగతులూ చేర్చాం. నేను కోరేది ఒక్కటే ఏవేవో వూహించుకొని ఈ సినిమాకి రావద్దు. ప్రశాంతంగా రండి. తప్పకుండా థ్రిల్‌కి గురవుతారు.. చూసిన ప్రతిసారీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అందుకే తప్పకుండా రిపీటెడ్ ఆడియన్స్ వస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే '1' ఎమోషనల్ ఎంటర్‌టైనర్. ఎమోషనల్ థ్రిల్లర్.''

తండ్రి కొడుకులతో...
"ఈ సినిమాలో మహేశ్ చిన్నప్పటి పాత్ర కోసం ఓ బాబు కావాలి. అందుకోసం చాలా మందిని చూశాం. ఓ సారి నేను మహేశ్ ఇంటికి వెళ్లినప్పుడు గౌతమ్ అక్కడ ఆడుకుంటూ పడిపోయాడు. నేను ఆదుర్దాగా అతన్ని లేవబోయాను. కానీ వద్దని, తనే లేస్తాడని మహేశ్ వారించారు. కిందపడ్డ గౌతమ్ తన తండ్రి వచ్చి లేపుతారేమోనని అలా కాసేపు అక్కడే ఉన్నాడు. ఆ క్షణమే నాకు చిన్నప్పటి మహేశ్ పాత్రకు ఆర్టిస్ట్‌గా గౌతమ్ కనిపించాడు. ఆ విషయాన్నే మహేశ్‌తో చెబితే 'వాడు చేస్తాడంటారా'? అన్నారు. ఓ రోజు చూద్దాం అని చెప్పాను. అలా గౌతమ్ షూటింగ్‌కి రావడం మొదలుపెట్టాడు. మామూలుగా మహేశ్‌కి ఓ అలవాటుంది. ఆయనకు సీన్‌ను తప్పకుండా దర్శకుడే చెప్పాలి. ఆయన ఏదైనా దర్శకుడి ద్వారానే వినాలనుకుంటారు. ఆ విషయాన్నే నేను గౌతమ్ దగ్గర కూడా గమనించాను. గౌతమ్‌కి ఎవరు సీన్ చెప్పినా మళ్లీ నా దగ్గరకు వచ్చి సీన్ చెప్పమని అడిగేవాడు

ఫీల్ నచ్చుతుంది..
'దూకుడు', 'బిజినెస్‌మేన్', 'సీతమ్మ వాకిట్లో...' ఈ సినిమాల్లో మహేష్ ప్రేక్షకులకు కావల్సినరత వినోదం పంచిపెట్టాడు. '1' ప్రచార చిత్రాలు చూస్తుంటే మాత్రం మహేష్ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. అభిమానులు ఇబ్బంది పడతారేమో?
వినోదం అంటే నవ్వించడం కాదు. ప్రేక్షకుల్ని కదలకుండా థియేటర్‌లో కూర్చోబెట్టడం. హీరో ఏడుస్తున్న సన్నివేశంలోనూ వినోదం ఉంటుంది. ఇక్కడ కావల్సింది... కథలోని ఫీల్ ప్రేక్షకుడికి నచ్చడం మాత్రమే. '1' సినిమా అలానే ఉంటుంది.

బంగారు ముద్ద
"మా హీరో బంగారు ముద్ద. బంగారంతో ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. మరింత అందంగా, వన్నెలీనుతూ కనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌గానీ, మరొకటిగానీ మా తృప్తికోసం నాలుగైదు వెరైటీలు చూసేవాళ్లం గానీ, మహేశ్ ఒంటిపై ఏది వేసినా అందంగానే కనిపించేది. ఈ సినిమాకు లుక్ పరంగా ఆయన తీసుకున్న కేర్ మాటల్లో చెప్పలేనిది.

సిక్స్‌ప్యాక్ చూపించారా?
అలాంటిదేం లేదండీ. నేను సిక్స్‌ప్యాక్ కావాలని మహేష్‌ని అడగలేదు. ఆయన బాడీ ఫిట్‌గా ఉంటుంది. అది ఈ సినిమాకి సరిపోతుంది కూడా. మహేష్ చేత చొక్కా విప్పించలేదు గానీ.. సిక్స్‌ప్యాక్ ఫీల్ కలిగేలానే చూపించాం.కాసింత ఫిజిక్ పెంచితే బావుంటుందని అడగ్గానే ఎంతో నిష్టతో, నియమంతో సిక్స్‌ప్యాక్ చేశారు. సినిమా చూసిన వాళ్లకి సిక్స్ ప్యాక్‌లో మహేశ్‌ని చూసిన తృప్తి ఉంటుంది. కానీ నేను మాత్రం అదేపనిగా చొక్కా విప్పించి, ఫిజిక్‌ని చూపించే సన్నివేశాలు తీయలేదు.

డాన్సుల విషయంలోనూ...
ప్రతీ విషయంలో ఆయన మరింత కేర్ తీసుకున్నారు. లుక్స్, వర్కవుట్స్, కాస్ట్యూమ్స్... ఇంకా కూర్చునే, లేచే, నడిచే పొజిషన్స్‌నుంచి ఆయన చూపించిన శ్రద్ధ నిజంగా గ్రేట్. టేకుల మీద టేకులు తీస్తానని అందరూ నా గురించి అనుకుంటారు. కానీ ఈ సినిమాకు నాకంటే మరో టేక్ చేద్దామని మహేశ్ అడిగి చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి.

కాపీ కాదు...
ఈ సినిమా ఓ హాలీవుడ్ చిత్రానికి స్ఫూర్తి అంటున్నారు.. అదేం లేదండీ. ఏ సినిమానీ కాపీ కొట్టలేదు. నా దగ్గర, నా సహాయకుల దగ్గర కావల్సినన్ని కొత్త కథలున్నాయి. ఇది పూర్తిగా కొత్త కథ. ఏదైనా సన్నివేశంలోగానీ, షాట్‌లోగానీ నాకు తెలియకుండానే ఆంగ్ల సినిమాల ప్రభావం పడి ఉంటే ఉండొచ్చు.

కృతిని అందుకే తీసుకున్నాం...
ఈ సినిమా కోసం ముందు కాజల్‌ని అనుకున్నాం. కానీ బల్క్ డేట్స్ కావాలి. తను సర్దుతుందో లేదోననిపించింది. అయినా మహేశ్ తన చేతిలో మైకుతో రాక్‌స్టార్‌గా కొత్తగా కనిపిస్తున్నారు కదా. ఆయన పక్కన కొత్తమ్మాయి అయితే మరింత కొత్తగా ఉంటుందని కృతి సనన్‌ని సెలక్ట్ చేశాం.

వివాదం రేపిన పోస్టర్ గురించి...
మహేశ్ , కృతితో సినిమాలో బీచ్ షాట్‌ను ఎవరినీ కించపరచాలని పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా నొచ్చుకుంటారనే ఊహ తగిలినా పెట్టకపోయేవాడిని. మా అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు.. ఇలా నా చుట్టూ బోలెడంత మంది ఆడవాళ్లున్నారు. వాళ్లను అవమానించే ఆలోచన పొరపాటున కూడా నాకు ఏ కోశానా లేదు. షాట్ కంపోజిషన్ బావుందని పెట్టామంతే.

పాటల గురించి..
సైకిల్ స్టాండ్‌లో ఓ సైకిల్ పడితే దాని పక్కనున్న సైకిళ్లన్నీ ఒకదానిపై ఒకటి ఒరుగుతాయి. ఇప్పుడు దేవి,నేను కలిస్తే పరిస్థితి అలా తయారైంది. మా కాంబినేషన్ అనగానే ఐటమ్ సాంగ్‌ను తప్పకుండా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలకు చేరుకోడానికి మరింత కృషి చేయాల్సి వస్తోంది. దేవితో నాకు మంచి వేవ్‌లెంగ్త్ ఉంది. నేను కథను చెప్పగానే తను సన్నివేశాలకు తగ్గట్టు ట్యూన్లు అల్లుకుపోతాడు. ఈ సినిమాలో కొంకణీ, జపనీస్ పదాలతో పాటలను పెట్టి చాలా బాగా చేశాడు. చంద్రబోస్‌గారి సాహిత్యం కూడా అంతే. నేనేం చెప్పినా ఆయనకు వెంటనే అర్థమైపోతుంది. మంచి పాటలిచ్చేస్తారు.

సగం డైరక్టర్...
పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు సగం డైరక్టర్ అని చెప్పాలి. హాలీవుడ్ టెక్నీషియన్లకు ఏమాత్రం తీసిపోని వ్యక్తి. మనదేశంలోని కెమెరామేన్‌లలో 1,2,3,4 అని లెక్కేస్తే తప్పకుండా ఏదో ఒక స్థానాన్ని దక్కించుకునే వ్యక్తి రత్నవేలు. అద్భుతమైన కెమెరా పనితనాన్ని కనబరిచారు.


Click it and Unblock the Notifications











