ఆర్య పాత్రకు చాలాసార్లు కన్ ఫ్యూజ్ అయ్యా
ఈ స్క్రీన్‌ప్లేను సృష్టించిన నేనే... చిత్రీకరణ సమయంలో ఆ మాయలో ఇరుక్కుని చాలాసార్లు కన్‌ఫ్యూజ్ అయిపోయాను అంటున్నారు దర్శకుడు సుకుమార్. ఆర్య 2 చిత్రం ప్రమోషన్ లో బాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. అలాగే ఆర్య 2 స్క్రీన్‌ప్లేలోని ఆ కన్‌ఫ్యూజన్‌నే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఒక హీరో అల్లు అర్జున్ అయితే, మరో హీరో స్క్రీన్‌ప్లేనే. అల్లు అర్జున్ కూడా ఈ స్క్రీన్‌ప్లే విని చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ స్క్రీన్‌ప్లేను తెరకెక్కించడంలో ఏ మాత్రం రాజీపడొద్దని చెప్పాడు.
ఇక ఆర్య-2లో అల్లు అర్జున్ పాత్ర గురించి చెప్పుకొచ్చారు. సృష్టి, స్థితి, లయ కారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఒకరు సృష్టిస్తే, ఇంకొకరు పరిపాలిస్తారు. మరొకరు నాశనం చేస్తుంటారు. ఈ మూడు లక్షణాలు కలగలిపి కొంతవరకైనా ఆధునికంగా ఒక పాత్ర చేయాలనుకున్నాను ఆ పాత్రే ఆర్య. ఓ సమస్యను తనే సృష్టిస్తాడు. తనే పర్యవేక్షిస్తాడు. చివరకు ఆ సమస్యను తనే నిర్మూలిస్తాడు. 'ఆర్య-2' సినిమాకు మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఈ థాట్‌తోనే ఈ సినిమా చేశాను. నాకు తెలిసి ఈ పాత్రను తెలుగులో ఏ హీరో కూడా చేయలేరు. అల్లు అర్జున్‌లో ఓ తెలియని అమాయకత్వం ఉంది. అదే ఈ పాత్రకు కావాలి. తను 'ఆర్య' చేశాడు కాబట్టి, 'ఆర్య-2' ఈజీగా చేయగలిగాడు అన్నారు.
అంతేగాక ఈ ఆర్య-2 చేద్దామనే ఆలోచన అల్లు అర్జున్‌ది అని చెప్పుకొచ్చారు. తమాషాగా ఉంటుంది, ఇలా చేద్దామా అని తనే సూచించడంతో నేను ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే 'ఆర్య'లో నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా చెప్పలేకపోయాను. వాటి తాలూకు భావోద్వేగాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. 'ఆర్య' సృష్టించడానికి నేను పెద్దగా కష్టపడలేదు. కానీ 'ఆర్య-2' చేయడం మాత్రం చాలా కష్టమనిపించింది. ఎందుకంటే బాగా లోతుల్లోకి వెళ్లి మరీ పాత్రల మనస్తత్వాన్ని ఆవిష్కరించాల్సి వచ్చింది. కేవలం 25 రోజుల్లో 95 శాతం స్క్రిప్ట్ సిద్ధం చేయగలిగాను. మిగిలిన పది శాతం పూర్తి చేయడానికి ఆరు నెలలు పట్టింది. దాన్ని బట్టే 'ఆర్య-2' సృష్టికి నేనెంత ప్రసవవేదన పడ్డానో అర్థమవుతుంది అంటూ వివరించారు.


Click it and Unblock the Notifications











