తాతయ్యను అలా చూసి బాధపడేవాన్ని: సుమంత్
హైదరాబాద్: హీరో సుమంత్ నటించిన 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రం త్వరలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల(అక్కినేని మరణించక ముందు) ఆయన ఓ దినపత్రికతో మాట్లాడుతూ తాతయ్య గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు.
'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రాన్ని తాతయ్య చూసారు. హాయిగా, మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఆయన అలా నవ్వుతుంటే నాకు కలిగిన ఆనందాన్ని మాటలతో చెప్పలేను. ఎప్పుడూ ఆయనలా నవ్వుతూనే ఉండాలనుకున్నా. ఈ సినిమాలో నేను వేసిన లేడీ గెటప్ తాతయ్య వేసిన లేడీ గెటప్ లా ఉందని అంతా నన్ను మెచ్చుకున్నారు' అన్నారు.

'నేను చిన్నపుడు తాతయ్య దగ్గరే పెరిగాను. ఆయనతో పాటు షూటింగులకు వెళ్లేవాణ్ణి, తాతయ్య నటనను శ్రద్ధగా గమనిస్తుండేవాణ్ణి. ఇంటికొచ్చిన తర్వాత తాతయ్య మాదిరి యాక్ట్ చేస్తుంటే...తాతయ్య నన్ను చూసి మురిసిపోయేవారు. అయితే కొన్ని సినిమాల క్లైమాక్సుల్లో తాతయ్య చనిపోతుండటాన్ని చూసి భయపడేవాన్ని. అది నిజంగా జరిగిందేమోనని కుమిలిపోయే వాన్ని. కానీ తాతయ్య నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని అవన్నీ నిజం కాదు...యాక్టింగే అని బుజ్జగించే వారు' అని చెప్పుకొచ్చారు సుమంత్.
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 2-45 నిముషాలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో 1920 సెప్టెంబర్ 20న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని వయస్సు 91 సంవత్సరాలు. 1944లో సినీ ప్రస్థానం మొదలెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి.
ఎన్నో బిరుదులు, సత్కారాలు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. ఆయన భార్య అన్నపూర్ణ కొన్ని ఏళ్ళ కిందట మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు నటజీవితం స్ర్తి పాత్రలతో మొదలైంది. బతుకుతెరువు కోసం ఆయన నాటకాల్లో స్ర్తి పాత్రలు వేసేవారు. ఘంటసాల బలరామయ్య ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపదం ఇలా అన్నిరకాల పాత్రలను పోషించిన అక్కినేని మొత్తం 256 చిత్రాలలో నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. ఆ కృషిలో భాగంగా తొలుత అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు.


Click it and Unblock the Notifications











