విజయావారి 'మాయాబజార్' కలర్లో,స్కోప్ లో
ఎన్టీ రామారకావు, ఎస్వీఆర్, ఎ ఎన్ ఆర్, సావిత్రి వంటి హేమాహేమీలు కలిసి చేసిన అధ్బుతం 'మాయాబజార్' మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. 53 ఏళ్ల క్రితం విజయా సంస్థ సృష్టించిన ఈ సెల్యులాయిడ్ దృశ్య కావ్యాన్ని గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ మూడు సంవత్సరాల శ్రమకు ఓర్చి భారీ వ్యయంతో, ఈ చిత్రాన్ని కలర్‌లో తీర్చిదిద్దారు. కలరైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ సి.జగన్ మోహన్ కష్టపడి రూపొందించిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ త్వరలో విడుదల చేస్తోంది.
ఇక ఈ తరహా ప్రయోగం దక్షిణాదిన ఇదే ప్రథమం అంటున్నారు. ఈ సందర్బంగా ఈ ప్రాజెక్టును చేపట్టిన గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ సి.జగన్‌మోహన్ మాట్లాడుతూ "మాయాబజార్ లాంటి చిత్రం తెలుగువారిది కావడం గర్వకారణం. అంతటి గొప్ప చిత్రాన్ని రంగుల్లో చూపించాలనుకొన్నాం. 'మొఘల్ ఎ ఆజమ్'ని రంగుల్లోకి మార్చడానికి ఉపయోగించిన పరిజ్ఞానం కంటే అధునాతమైన దాన్ని మేం ఉపయోగించాం. ఆ సినిమాకి రంగులద్దేందుకు దాదాపు మూడున్నర సంవత్సరాల సమయం తీసుకున్నారు.
అంతకంటే మెరుగైన రీతిలో మేం చేశాం. 165 మంది సాంకేతిక నిపుణులతో 'మాయాబజార్'ని రంగుల్లోకి మార్చే ప్రాజెక్ట్‌ని చేపట్టాం. ఆరు నెలల సమయం పట్టింది. నేటి థియేటర్లన్నీ స్కోప్ తెరలతో ఉన్నవే. కాబట్టి అందుకు తగ్గట్టు మార్చి, డీటీఎస్ చేశాం. త్వరలోనే ఈ చిత్రం విడుదల తదితర వివరాల్ని వెల్లడిస్తామ"న్నారు. ఇక ఈ రంగుల 'మాయాబజార్'ని సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ విడుదల చేస్తుంది.
1957 మార్చి 27న విడుదలైన ఈ 'మాయాబజార్' చిత్రాన్ని కె.వి.రెడ్డి డైరక్షన్ చేసారు. విజయవారు నిర్మించిన ఆ చిత్రంలో ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. తొలిసారిగా కృష్ణుడి పాత్రను పూర్తి స్థాయిలో పోషించారు. అలాగే అభిమన్యుడి పాత్రలో అక్కినేని, ఘటోత్కచుని పాత్రలో ఎస్.వి.ఆర్, శశిరేఖ గా సావిత్రి నభూతో నభవిష్యతి అన్నట్లు పోషించింది. హిందీలో 'మొఘల్ ఎ ఆజమ్'ని రంగుల్లో మార్చి రిలీజ్ చేసి హిట్టు కొట్టిన స్పూర్తితో ఈ చిత్రానికి రంగులద్దుతున్నారు.


Click it and Unblock the Notifications











