Super Star Krishna ఇకలేరు.. గుండెపోటుతో కన్నుమూత.. మహేష్ బాబుకు తీవ్ర విషాదం
భారతీయ సినిమా పరిశ్రమలో సుమారు ఆరు దశాబ్దాలపాటు విభిన్నమైన పాత్రలు, విలక్షణ నటనతో నిర్మాతగా, దర్శకుడిగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన మరణంతో యావత్ సినీలోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురైన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాల్లోకి వెళితే..

1942లో గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో
కృష్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. ఆయన మే 31వ తేదీ 1942లో గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో రాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు మహేష్ బాబు, స్వర్గీయ రమేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని సంతానం ఉన్నారు. ఎంపీ గల్లా జయదేవ్, సంజయ్ స్వరూప్, సినీ హీరో సుధీర్ బాబు ఆయన అల్లుళ్లు.

తెలుగు సినిమా పరిశ్రమలోకి
కృష్ణ తొలిసారి కుల గోత్రాలు చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పదండి ముందుకు, పరువు ప్రతిష్ట చిత్రాల్లో నటించారు. 1965లో ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన తేనే మనసులు చిత్రంతో తొలి బ్రేక్ లభించింది. ఆ తర్వాత కన్నెమనుసులు చిత్రంతో ఇండస్ట్రీలో నటుడిగా నిలుదొక్కుకొన్నారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే అప్పటి అగ్ర నటులు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌తో స్త్రీ జన్మ, నిలువు దోపిడి, మంచి కుటుంబం, విచిత్ర కుటుబం, అక్కా చెల్లెలు లాంటి చిత్రాల్లో నటించారు.

పద్మాలయ స్టూడియో అధినేతగా
1970వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పద్మాలయ స్టూడియోను స్థాపించారు. ఈ బ్యానర్‌పై అగ్ని పరీక్ష, మోసగాళ్లకు మోసగాడు. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామారాజు లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడమే కాకుండా బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకొన్నారు.

రాజకీయాల్లో రాణించిన కృష్ణ
కేవలం నటుడు, నిర్మాత, దర్శకుడిగానే కాకుండా.. సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోనూ రాణించారు. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఏలూరు నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. చాలా కాలంపాటు కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధాన్ని కొనసాగించారు. చివరి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు.

అవార్డులు, రివార్డులు
సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులను అందుకొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రానికి 1974లో నంది అవార్డు, 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2003లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, 2009లో పద్మభూషణ్, ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్ అందుకొన్నారు.


Click it and Unblock the Notifications











