ఓపిక లేదంటూ సూపర్ స్టార్ రిటైర్ మెంట్ ప్రకటన
హైదరాబాద్ సూపర్ స్టార్ కృష్ణ ఇక తనకు నటించేటంత ఓపిక లేదని, అందుకే ఇక రిటైర్ మెంట్ తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ..జూబ్లీహిల్స్‌లో ఓ కార్యక్రమంలో తన సతీమణి విజయనిర్మలతో కలిసి పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ''ఇప్పుడు నాకు నటించేంత ఓపిక లేదు. అందుకే ఇక సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్లే. రాజకీయాల్లోనూ నా పాత్ర ఉండదు '' అన్నారు.
ఇక మీదట సినిమాల్లో నటించేది లేదని తేల్చి చెప్పారు ప్రముఖ నటులు కృష్ణ. తనకు ఛత్రపతి శివాజీ సినిమాను నిర్మించి నటించాలని ఉండేదని... ఆ కోరిక తీరని కలగానే మిగిలిందని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన చెప్పారు. విజయనిర్మల చెబుతూ ''చిన్నప్పటి నుంచి నటిస్తూనే ఉన్నాను. ఇకముందు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంటాను'' అన్నారు.
ఇక తన చిత్రాల్లో తన కుమారుడు మహేష్ కి ఇష్టమైన చిత్రాలు గురించి చెపుతూ.... నేను నటించిన సినిమాల్లో మహేష్‌బాబుకు 'గూఢాచారి 116' అంటే ఎంతో ఇష్టము అన్నారు. అలాగే తన గ్లామర్ రహస్యం చెపుతూ.. ''నేను అతిగా తినను. చేపల కూరంటే బాగా ఇష్టపడతాను. రోజూ యోగాతో పాటు వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ చేస్తుంటాను. అదే నా గ్లామర్ రహస్యము'' అని కృష్ణ తెలిపారు.


Click it and Unblock the Notifications











