ఏపీ ఎన్నికల్లో పేలుతోన్న మహేశ్ డైలాగులు .. వీడియో వైరల్
ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రచారం మారుమోగిపోతోంది. ప్రధాన పార్టీల అగ్రనేతలు, వారి మద్ధతుదారుల అభ్యర్ధుల తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సహజంగానే సినిమాకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే. నెహ్రూ గారి నుంచి మోడీ గారి వరకు ఇది చూస్తూనే వున్నాం. ఎన్నికల సమయంలో పార్టీలకు అనుకూలమైన సినిమాలు, పాటలు, డైలాగులు, స్టార్స్‌తో ప్రచారాలు షరా మామూలే. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమాలోని డైలాగులను ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎంతోమంది నేతలు ప్రచారంలో ప్రత్యర్ధులపై వదిలారు.
ఇక ఏపీ ఎన్నికలంటే దేశంలోనే ఎంతో స్పెషల్. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సందడి నెలకొంటుంది. ఏ నలుగురు ఒక్కచోట చేరినా ఈసారి ఎవరు అని చర్చించుకుంటూ వుంటారు. మరి తెలుగు ఎన్నికల్లో టాలీవుడ్ స్టార్స్ ప్రస్తావన లేకుంటే ఎలా. అసలే ఈసారి ఏపీ ఎన్నికల్లో ముగ్గురు స్టార్స్ పోటీ చేస్తుండటం, వారి కోసం సినీనటుల ప్రచారం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

కాగా.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సినిమాల్లోని డైలాగ్స్ పేలుతున్నాయి. ప్రచారంలో , ఇంటర్వ్యూలలో నేతలు ప్రిన్స్ చెప్పిన డైలాగులను తమకు వర్తింపజేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నికలకు ముందు నుంచే సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న ఆయన తీవ్రమైన పోటీ మధ్య గుంటూరు టికెట్ దక్కించుకున్నారు. వరుసగా రెండు సార్లు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వస్తోంది. అమరరాజా గ్రూప్ అధినేత గల్లా జయదేవ్ ఎంపీగా రెండు సార్లు గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకుంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన పోటీకి, రాజకీయాలకు దూరంగా వుంటానని ప్రకటించారు.
సర్వేలు, ఇతర సమాచారం ఆధారంగా గుంటూరులో చంద్రశేఖర్‌ను దించారు చంద్రబాబు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెమ్మసాని.. ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ప్రచారం , ఇతర వివరాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన బిజినెస్‌మెన్ ''నేను ముంబైకి ఊరికే రాలేదు.. పోయించడానికే వచ్చాను '' అంటూ సూపర్‌స్టార్ చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. దీని మాదిరిగానే ''నేను ఊరికే రాలేదు.. జెండా పాతడానికే వచ్చాను '' అన్నట్లు చంద్రశేఖర్‌ను ఉద్దేశించి అన్నారు టీవీ5 మూర్తి.
మరో వీడియోలో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన గీతం భరత్ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ప్రచారంలో భాగంగా ఓ టీ స్టాల్ వద్ద డబ్బును యూపీఐ ద్వారా చెల్లిస్తారు భరత్. ఆ సమయంలో మహేశ్ వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు యాంకర్ మీరు సినిమాలు చూస్తారా అని ప్రశ్నించగా.. బాగా చూసేవాడినని చెబుతారు. పనిలో పనిగా అతడు సినిమాలోని ''పూర్వం పెట్టే కాల్చేవాడిని ఇప్పుడు బాగా తగ్గించేశా '' అనే డైలాగ్ చెబుతారు భరత్. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











