జియా సూసైడ్ : జూన్ 13 వరకు సూరజ్ కస్టడీ
ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్యతో సంబంధం ఉన్న కేసులో...ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలిని ఈ నెల 13 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ముంబై కోర్టు ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన సూరజ్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
జియా ఖాన్ జూన్ 3న ముంబై జుహులోని తన అపార్టుమెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణం కేవలం కెరీర్లో ఆటుపోట్ల వల్ల ఒత్తిడే అని భావించి కేసు నమోదు చేసుకున్నారు. కానీ జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ దొరకడంతో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జియా తన లేఖలో బాయ్ ఫ్రెండ్ సూరజ్ కారణంగా మెంటల్‌గా, ఫిజికల్‌గా బాధను అనుభవించానని, సూరజ్ పంచోలి కారణంగా తాను రేప్ చేయబడ్డానని, అతను తన జీవితాన్ని నాశనం చేసాడని పేర్కొంది. జియా రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు సూరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కోర్టు అనుమతితో సూరజ్ పంచోలిని తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జియా ఖాన్ తల్లి రబియా తన ట్విట్టర్లో సూరజ్ పంచోలి వల్లనే తన కూతురు తమకు దూరమైందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











