జియాపై ఇప్పటికీ ప్రేమే, అలసిపోయా: సూరజ్
ముంబై: బాలీవుడ్ తార జియా ఖాన్ మృతికి ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలీయే కారణమనే మాట వినిపిస్తోంది. అయితే, సూరజ్ పంచోలీ వాదన మరో విధంగా ఉంది. జియాఖాన్ అంటే తనకు ఇప్పటికీ ప్రేమ ఉందని, ఆమెను మరిచిపోవడం సాధ్యం కావడం లేదని సూరజ్ పంచోలీ అన్నాడు. జియాతో తన సంబంధం గురించి, ఆమెతో విడిపోవడానికి గల కారణం గురించి అతను మొదటిసారి పెదవి విప్పాడు.
జియా ఖాన్ తీవ్రమైన డిప్రెషన్‌లో పడిందని, గతంలో కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని చెప్పాడు. జియాతో తెగదెంపులు చేసుకోవాలని తాను ఏ రోజు కూడా అనుకోలేదని, అయితే అంతకు మించి తనకు మరో మార్గం లేకపోయిందని అతను ఓ దినపత్రికతో చెపపాడు.
తన కారణంగా తల్లికి దూరం కావాలని కూడా తాను జియాను అడగలేదని అన్నాడు. ప్రతి రోజూ జియా ఖాన్ ఏడ్చేదని, తనపై అపనమ్మకం ప్రకటించేదని, దాంతో తాను అలసిపోయానని, 20 రోజుల ముందు ఆమెతో సగం మేరకు మాట్లాడడం తగ్గించానని చెప్పాడు.
తనకు జియా లేని లోటు కనిపిస్తోందని చెప్పాడు. తన ఇంట్లోని ప్రతిదీ జియా ఖాన్‌ను గుర్తు చేస్తుందని సూరజ్ చెప్పాడు. జియా ఖాన్ అందమైన మనిషి అని చెప్పాడు. మంచి జీవితం కోసం ఇంకా కొన్ని రోజులు ఆమె నిరీక్షించాల్సి ఉండిందని, ఇంత తొందరగా ఆమె లోకాన్ని వదిలి వెళ్లిపోవడం అన్యాయమని సూరజ్ అన్నాడు.
అందుకు తానేమీ చేయలేనని అన్నాడు. ఈ సంఘటనతో తన తల్లిదండ్రులపై, సోదరిపై తనకు ప్రేమ పెరిగిందని సూరజ్ పంచోలీ చెప్పాడు.


Click it and Unblock the Notifications












