సైలెంట్‌గా ఉండండి, మావాళ్లు చూసుకుంటారు.. మెరుపు దాడులపై మహేష్, ఎన్టీఆర్, సిద్దార్థ్!
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటలకు జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళాలు వెయ్యి కేజీల బాంబు విసిరారు. దీనితో అక్కడ ఉన్న 200పైగా ఉగ్రవాదులు హతం అయ్యారు. స్థావరాలన్నీ నేలమట్టం అయినట్లు భారత ప్రభత్వం ప్రకటించింది. పాకిస్థాన్ కూడా భారత వైమానిక దళాల దాడుల్ని ధ్రువీకరించింది. అందరూ దీనిని సర్జికల్ స్ట్రిక్స్ 2 గా అభివర్ణిస్తున్నారు. దీనిపై సినీ ప్రముఖులంతా స్పందిస్తూ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మావాళ్లు చూసుకుంటారు
ప్రముఖ హీరో సిద్ధార్థ్ పాక్ పై జరిగిన మెరుపు దాడుల గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. పాకిస్థాన్ కు రాజకీయ ఐక్యత లేదు. పాక్ ఆర్మీకి క్రమ శిక్షణ లేదు.. ఇతర దేశాలపై యుద్ధం చేసేంత బలం, ఆర్థిక స్థోమత వాళ్లకు లేదు. కాబట్టి మీరు ఇండియాని అలా వదిలేయండి. ఉగ్రవాదులకు రక్షణ కల్పించకుండా సైలెంట్ గా ఉండండి. మిగిలినది మావాళ్లు చూసుకుంటారు. సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని హీరో సిద్దార్థ్ ట్వీట్ చేశాడు.
ఇండియన్ ఆర్మీ శక్తి
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్పందిస్తూ.. ఇంత సడెన్ గా ఎంత పెద్ద పని పూర్తి చేశారు. అది కూడా తెల్లవా రుజామున 3:30 గంటలకు.. వాహ్. ఇది మన ఇండియన్ ఆర్మీ సత్తా, మేధస్సుకు నిదర్శనం. ఇది వాళ్లకు తిరిగి చెల్లించాల్సిన సమయం. జై హింద్ అని ట్వీట్ చేశాడు.
సేఫ్‌గా తిరిగొచ్చారు
లోకనాయకుడు కమల్ హాసన్ పాక్ పై మెరుపు దాడుల గురించి మాట్లాడుతూ.. మన 12 యుద్ధవిమానాలు పాక్ లో విధ్వంసం సృష్టించి సేఫ్ గా ఇంటికి తిరిగొచ్చాయి. తన ముద్దు బిడ్డలని చూసి భరత మాత గర్విస్తోంది అని కమల్ అన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి భారత వైమానిక దళాలకు సెల్యూట్ కొట్టారు. వరుణ్ తేజ్ తేజ్ కూడా సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్, అఖిల్ ఏమన్నానంటే
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాక్ పై భారత్ చేసిన వైమానిక దాడులపై ప్రశంసలు కురిపించారు. మనదేశం అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. భారత దేశానికి ఇది గర్వకారణమైన రోజు. మనం ఏమైనా చేయగలం అని నిరూపించారు. జైహింద్ అని అఖిల్ ట్వీట్ చేశాడు.
చాలా గర్వంగా ఉంది
చాలా గర్వంగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్స్ కు నా సెల్యూట్ అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. భారత వైమానిక దళానికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశాడు. జైషే పరిస్థితి ఎలా ఉంది.. నాశనమైపోయింది అని యాంకర్ రష్మీ ట్విట్టర్ లో పేర్కొంది.


Click it and Unblock the Notifications











