రక్త చరిత్ర-2లో సూరి హీరో, పరిటాల రవి విలన్?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావును రక్త చరిత్ర-1లో విలన్ గా చూపించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర-2లో ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ రేకెత్తుతోంది. అనూహ్యంగా రక్త చరిత్ర-1లో వర్మ ఎన్టీ రామారావును విలన్ ను, హత్యకు గురైన తెలుగుదేశం శాసనసభ్యడు పరిటాల రవిని హీరోను చేశారు. తొలి భాగంలో మద్దెలచెర్వు సూరి పాత్ర లేదు. దీంతో సూరి తొలి భాగం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రక్త చరిత్ర-2లో పరిటాల రవిని విలన్ ను, మద్దెలచెర్వు సూరిని హీరోను చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్మపై మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ చూపించిన తీరుకు వర్మ ఇప్పటికే ఆత్మరక్షణలో పడ్డారు. పరిటాల రవిని విలన్ చేస్తే వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా రెండో భాగంలో ఓ ప్రముఖ హీరోకు పరిటాల రవి గుండు కొట్టించిన సీన్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగు అగ్ర హీరో ఆ సీన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాన్ని తొలగించినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ వర్మ దాన్ని అలాగే ఉంచారా, తీసేశారా అనేది తెలియడం లేదు. ఏమైనా, తెలుగు రాజకీయాల్లో వర్మ ఇంతకు ముందు లేని అగ్గిని రాజేశారు.


Click it and Unblock the Notifications











