తెలుగు తెరపై సూర్య ప్రతాపం

By Staff

మొదట మణిరత్నం రూపొందించిన యువ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం తర్వాత రెండేళ్లకు అతడు నటించిన గజనీ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు అల్లు అరవింద్‌. అలా చేయడానికి కూడా ఒక కారణం ఉందంటారు సినీవిశ్లేషకులు. అపరిచితుడు తర్వాత హీరో విక్రమ్‌కి విపరీతంగా పెరిగిపోయిన జనాదరణను చెక్‌లో పెట్టడానికి ఇంకో తమిళ హీరోని ప్రమోట్‌ చేయవలసిన అవసరాన్ని కొందరు తెలుగు నిర్మాతలు గుర్తించారన్నది సినీజనాభిప్రాయం. ఆ సంగతి ఎలా ఉన్నా.. ఆ యువకుడి పరిస్థితి మాత్రం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. సూర్య!

అప్పటి నుంచి ఆ యువకుడు వెనుదిరిగి చూడటం లేదు. చాలామంది తమిళ హీరోల్లా అతడు కూడా ఒక కాలు మద్రాసులో, మరో కాలు హైదరాబాద్‌లో పెట్టేసి కూర్చున్నాడు. ఒక్క నెల రోజుల వ్యవధిలో సూర్య నటించిన మూడు తమిళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయి రిలీజ్‌ అవుతున్నాయంటే - సూర్యకు తెలుగులో ఎంత మార్కెట్‌ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

మొదటగా వి. రామ్‌ నిర్మాతగా అమీర్‌ దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌. కమ్యూనికేషన్స్‌ సమర్పణలో విడుదలవుతున్న చిత్రం - కంచు. త్రిష, లైలా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సూర్య ఒక మాస్‌ హీరోగా, లవర్‌ బాయ్‌గా కనిపించబోతున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం తమిళనాట విజయభేరి మోగించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తోంది.

ఆ తర్వాత విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం - నువ్వు.. నేను.. ప్రేమ. కాబోయే భార్యభర్తలు సూర్య, జ్యోతిక, ఇంకా భూమిక చావ్లా నటించిన ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రం ఆడియో ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదలైంది. ఎ.ఆర్‌. రెహమాన్‌ అందించిన స్వరాలు ఇప్పటికే బాగా పాపులర్‌ అయ్యాయి. కాకకాక చిత్ర సృష్టికర్త గౌతమ్‌ మీనన్‌ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన కృష్ణ ఒక యదార్థ ఘట్టాన్ని కథగా మలిచారని చెబుతున్నారు సూర్య.

ఈ ప్రాజెక్టును సూర్య కజిన్‌ జ్ఞానవేల్‌ స్టూడియో గ్రీన్‌ పతాకంపై రూపొందించారు. దీనితో ఒకరకంగా ఇది తన సొంత చిత్రం అంటూ సూర్య స్వయంగా ప్రమోట్‌ చేస్తున్నారు. సూర్య, జ్యోతికల పెళ్లి సెప్టెంబర్‌ 11న జరగనుంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక మూడో ప్రాజెక్ట్‌ - కిడ్నాప్‌. సూర్య, జ్యోతిక జంటగా నటించిన ఈ సినిమాని స్టార్‌ డైరెక్టర్‌ బాల రూపొందించడం విశేషం. శివపుత్రుడు, సేతు వంటి అద్భుత దృశ్యకావ్యాలను తెరకెక్కించిన బాల దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన ఒక చిత్రాన్ని కిడ్నాప్‌ టైటిల్‌తో తెలుగులో డబ్బింగ్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి రోజా ఒక ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.

ఇలా వరుసగా రెండు నెలల వ్యవధిలో మూడు చిత్రాల ద్వారా వస్తున్న సూర్య.. త్వరలోనే ఒక స్ట్రయిట్‌ తెలుగు చిత్రం చేయాలనుందంటూ ఇక్కడి నిర్మాతలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ఒక వైపు విక్రమ్‌, మరో వైపు సూర్య.. ఇంకా ధనుష్‌, శింబు.. తదితర నటులంతా తెలుగులో తమ సత్తా చాటుకుంటూ ఇక్కడి హీరోలకి గట్టి పోటీ ఇవ్వడం ఒకరకంగా ప్రేక్షకులకు మంచిదే అంటున్నారు ఫిలింనగర్‌ విశ్లేషకులు. పోటీ ఉన్నప్పుడే కదా.. క్వాలిటీ పెరిగేది.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X