సమంతకు మరో లక్కీఛాన్స్
హైదరాబాద్: వరస భారీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న సమంతకు మరో లక్కీఛాన్స్ వరించింది. తాజాగా సమంత తమిళ స్టార్ హీరో సూర్యకు జంటగా నటించడానికి అంగీకరించింది. ప్రముఖ దర్శక, నిర్మాత లింగుస్వామి రూపొందించనున్న ఈ చిత్రం 2013 మార్చిలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దర్శకుడు సర్గుణం దర్శకత్వం వహించనున్న సొట్టవాళకుట్టి చిత్రంలో ధనుష్‌కు జంటగా కూడా నటించనుందనే ప్రచారం జరుగుతోంది. ఆమె మేనేజర్ మాత్రం ప్రస్తుతానికి తమిళంలో సూర్య చిత్రం ఒక్కటే అంగీకరించినట్లు పేర్కొన్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో తన నట జీవితానికి శ్రీకారం చుట్టిన ఈ చెన్నై భామకు విజయం మాత్రం తొలుత టాలీవుడ్‌లోనే లభించింది. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సమంత ఆ తరువాత బృందావనం, దూకుడు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్‌గా అయిపోయింది.
ప్రస్తుతం మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ, జూనియర్ ఎన్‌టీఆర్‌తో కలిసి బాద్‌షా చిత్రంలోనూ నటిస్తోంది. అదే విధంగా తాను గురువుగా భావించే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించిన నీ దాన్ ఎన్ పొన్ వసంతం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇది తెలుగు, హిందీ భాషల్లోనూ రూపొందడం విశేషం.


Click it and Unblock the Notifications











